ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి పాము కాట్లు.. వారిలో ఐదుగురి మృత్యువాత.. ఇలా చనిపోయిన వారంతా పురుషులే.. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా తొగరిఘట్ట గ్రామంలో ధర్మణ్ణ కుటుంబంలో ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాము కాటుకు గురవుతున్నారు. గడిచిన 20–25 ఏళ్లలో పాముల కాటుతో ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబంలో ఆయనతో పాటు హనుమంతప్ప, వెంకటేశ్, శ్రీనివాస్, ఇటీవల గోవిందరాజు మరణించారు.
గత బుధవారం రాత్రి గోవిందరాజు పొలంలో నీరు పెడుతుండగా పాము కాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. చనిపోయిన వారంతా దాదాపు ఒకే ప్రదేశంలో పాము కాట్లకు గురయ్యారు. ధర్మణ్ణ ఒక రోజు తన పొలం వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టును ఉన్నపళంగా నరికేశాడు. ఆ చెట్టు శాపమే ప్రస్తుతం ఈ మరణాలకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఆ చెట్టు ఆ తర్వాత కాలంలో మళ్లీ చిగురించి చెట్టుగా ఎదిగింది. పాము పగ పోవాలని గ్రామస్తులు స్థానిక మునియప్ప ఆలయంలో నిత్య పూజలు చేపట్టారు.