రైతులకు పెట్టుబడి సాయంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచుతారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున కేంద్రం పెట్టుబడి సాయంగా ఇస్తోంది రైతుకు. రూ.2వేల చొప్పున మూడు దఫాలుగా ఏడాదికి ఆరువేల మొత్తాన్ని అందిస్తోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి మరో రెండువేల రూపాయలు అదనంగా ఇస్తారని, మొత్తం రూ.8వేలు సాయంగా అందిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు బడ్జెట్లో కూడా ప్రకటన చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. తాజాగా కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది. పీఎం కిసాన్ మొత్తాన్ని ప్రస్తుతానికి పెంచే యోచన లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ మేరకు సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జనవరి 30వ తేదీ వరకు అర్హులైన మొత్తం రూ.2.24 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిధులను సమకూరుస్తోంది.