మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. పార్టీ అత్యంత కీలక నేత తన పదవికి రాజీనామా చేసి, అధిష్టానానికి షాకిచ్చారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్ మంగళవారం ఆ పదవికి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, ఆయనతో కలిసి తాను పని చేయలేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం లేఖ రాసిన విషయం వెలుగు చూసింది. ఆయన తన రాజీనామా లేఖను ఖర్గేకు పంపించారు. ఇటీవల నాసిక్ డివిజన్ నుండి గ్రాడ్యుయేట్ ఇండిపెండెండ్ ఎమ్మెల్సీగా గెలిచిన సత్యజిత్ థంబేకు థోరట్ బంధువు. ఇతను గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. వివిధ మంత్రి హోదాల్లో పని చేశారు.
థోరట్ వర్గం సమాచారం మేరకు… కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు పంపించారు. దీంతోపాటు ఖర్గేకు సోమవారం రాసిన లేఖను కూడా జత చేశారు. పటోలే తనను ఏ విధంగా అవమానించారో లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసినట్లు అందులో పేర్కొన్నారు. సత్యజిత్ థంబే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఉద్దేశపూర్వకంగానే ఇష్టారీతిన మాట్లాడినట్లు తెలిపాడు. తన బంధువైన థోరట్కు చెడ్డపేరు తీసుకు వచ్చేందుకు, తమ కుటుంబాన్ని కాంగ్రెస్కు దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ థంబే మండిపడ్డారు.