తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు నీటి పారుదల రంగానికి కూడా భారీగా నిధులను కేటాయించారు . నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.26, 831 కోట్లు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని బడ్జెట్ స్పీచ్ చదవుతూ పేర్కొన్నారు. బావులు, బోర్లే దిక్కయిన రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యల పాలడిందని గుర్తుచేశారు. పాడుబడిన ఇండ్లు, బీడుపడిన పొలాలతో బక్క చిక్కిపోయిందని తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాగునీటి రంగంలో స్వర్ణయుగం తలపిస్తుందని స్పష్టం చేశారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో సస్యశ్యామల మాగాణంగా నిలుస్తోందని వివరించారు.
వేసవిలో మత్తడి దుంకుతూ..
వేసవిలో కూడా మత్తడి దుంకుతూ అలుగెత్తుతున్న చెరువులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీజలాలు సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులు బాగు పడటంతో నీటి నిల్వ సామర్థ్యం బాగా పెరిగిందని తెలిపారు. ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేయడంతో వేసవిలో చెరువులు జలకళను సంతరించాయని తెలిపారు. భూగర్భ జల మట్టం పెరగడంతోపాటు.. 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందిందని పేర్కొన్నారు.
20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల పెండింగ్ ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తిచేసిందని తెలిపారు. 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి అయిందని చెప్పారు. కరవు పీడిత ప్రాంతంగా, వలసల జిల్లాగా పేరు ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు పచ్చని పంటలకు నెలవయిందని వివరించారు. ఇప్పుడు పాలమూరులో వ్యవసాయ పనుల కోసం ఇతర రాష్ట్రాల కూలీలు వలస వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. మొదటి దశ 650 చెక్ డ్యాం నిర్మాణం పూర్తయిందని వివరించారు.
కోటి ఎకరాల మగాణి
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేలా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం 60 శాతం పూర్తయిందని.. ప్రతిపక్షాలు కేసులు వేస్తూ అడ్డుకుంటున్నాయని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడిందని తెలిపారు. వచ్చే రెండు మూడేళ్లలో మరో 50 లక్షల 24 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. కోటికి పైగా ఎకరాల ఆయకట్టును సృష్టించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సాకారం అవుతుందన్నారు.