Parliament Session 2024 : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం అయిన తర్వాత తొలుత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేసి తర్వాత ఎంపీలతో ప్రమాణ స్వీకారాలు చేయించడం ప్రారంభించారు.
ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు ప్రధాని మోదీ(Prime Minister Modi) హాజరయ్యారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకార అనంతరం ఎంపీగా(Member of Parliament) మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు అందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా పని చేయాలని ఎంపీలకు సూచించారు.
2047 సంవత్సరం నాటికి భారత్ వికసిత భారత్‌గా మారాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగానే తమ ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుంటోందని తెలిపారు. వాటితోనే తాము ముందుగు సాగుతామన్నారు. మూడోసారి ప్రజలు సేవచేసే అవకాశాన్ని కల్పించడం అంటే సాధారణమైన విషయం కాదన్నారు. తమ ప్రభుత్వ పనులను, విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. అందుకు అనుగుణంగా తామూ నడుచుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత రాధామోహన్ సింగ్, అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ ఔహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, ఫగ్గన్ సింగ్ కులస్తే తదితరులు వరుసగా ప్రమాణస్వీకారాలు చేశారు. మిగిలిన సభ్యుల స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. ఈనెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది.