Pawan Kalyan : ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. స్వపక్ష… వివక్షాలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. వైసీపీ ఎలాగైనా రెండో సారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుంటే.. ఇటు కూటమి ఎట్టిపరిస్థితుల్లోనే జగన్ ను రాకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పోటా పోటీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. నేడు ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటేయాలని జనసేనాని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం గళమెత్తిన పార్టీ జనసేన అని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు భయం లేకుండా బతకాలన్నదే తన కోరిక అన్నారు.
దాంతో పాటు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఈ భూహక్కు చట్టం అమలు చేయడంతో విపక్షాలకు మంచి ప్రచార అస్త్రం లభించినట్టయింది. ఈ చట్టంలోని లోపాలను ప్రజలకు పూసగుచ్చినట్టు వివరించారు. జగన్ అబద్దాల కోరని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకుకి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కైకలూరు ఎమ్మెల్యేది కాదు, ఆయన కొడుకుది కాదన్నారు. వైఎస్ జగన్ కుతంత్రాలతో గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర్య అభ్యర్థికి ఇచ్చారంటూ ఆరోపించారు. కూటమి తరపున బీజేపీ నుంచి కామినేని పోటీ చేస్తున్నారని.. కాంటూరు సమస్యపై కామినేని కేంద్రంతో మాట్లాడతారన్నారు. గంజాయి, అమ్మాయిల అదృశ్యం, యువత గంజాయికి బానిసలుగా మారుతున్నారని ఆయన పేర్కొన్నారు. లాండ్ టైటిలింగ్ యాక్టు కాదు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ లేకుండానే చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. అధికారంలోకి రాగానే కైకలూరు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మిస్తానంటూ పవన్ హామీ ఇచ్చారు.
వైసీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. 430 కేసులు నమోదు చేశారని తెలిపారు. మీడియాను కట్టడి చేసేందుకు జీవో నెంబర్ 1 తీసుకొచ్చారన్నారు. ప్రజలు ఎంతో ఆలోచన చేసి విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.