కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం రెండుసార్లు మాత్రమే పేదల ప్రస్తావన తెచ్చారన్నారు. ప్రజలు, వారి ఆందోళనలను ఏమాత్రం మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏ మాత్రం కనికరం లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారన్నారు. 90 నిమిషాల ప్రసంగంలో నిరుద్యోగం, పేదరికం, అసమానతల గురించి ఒక్కసారి మాట్లాడలేదని విమర్శించారు. ప్రజల జీవితాలు, జీవనోపాధి, అసమానతలు వంటి ఆందోళనలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అవసరమైన మాటలు బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కనిపించలేదన్నారు. కేవలం రెండుసార్లే పేదలు అనే పదం ఉపయోగించడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వానికి ఎవరంటే పట్టింపు ఉందో, ఎవరిపట్ల పట్టింపు లేదో ఇట్టే తెలిసిపోతుందన్నారు.
బడ్జెట్లో పన్నుల ఉపశమనం కూడా తగినంతగా లేదని, కొత్త పన్నుల విధానం ఎంచుకునే వారిని ఉద్దేశించే ఈ టాక్స్ రిలాక్సేషన్ ప్రకటించారన్నారు. కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకోవడం డిఫాల్డ్ ఆప్షన్ గా పేర్కొన్నారు. వస్తు సేవల పన్నులపై మాట్లాడుతూ… పరోక్ష పన్నులేవీ తగ్గించలేదన్నారు. క్రూరమైన, అహేతకమైన జీఎస్టీ రేట్లలో ఎలాంటి కోత లేదన్నారు. కీలకమైన ఇంధనం, ఎరువులు, ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి అంశాల ప్రస్తావనే బడ్జెట్లో లేకపోవడం బాధాకరమని చెప్పారు. పెట్రోల్, డీజిల్, సిమెంట్, ఎరువులు తదితరాల ధరలు తగ్గించలేదన్నారు. సర్చార్జీలు, సెస్లలో కోత లేదని, రాష్ట్ర ప్రభుత్వాలతో వీటిపై సంప్రదించినట్టు కనిపించలేదన్నారు. నిరుద్యోగ యువత, హోమ్మేకర్లు, పన్ను చెల్లింపుదారులకు వార్షిక బడ్జెట్లో ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదన్నారు.