World Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సం.. విశిష్టత.. థీమ్
ప్రతీ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవం రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
World Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యవస్థాపక దినోత్సవం రోజున నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి, మానవాలి శ్రేయస్సు కోసం ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే గా పాటిస్తారు. ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి (UN) క్రింద పనిచేసే స్వయంప్రతిపత్త సంస్థ. ప్రపంచవ్యాప్తంగా WHO సాధించిన విజయాలను గుర్తించడానికి, వాటిని ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజును జరుపుకుంటారు. ముఖ్యంగా WHO ఏ విధంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎలా ఎదుర్కొంటుంది అనేది వివరిస్తుంది. ప్రతీ ఏడాది ఒక థీమ్ పెట్టుకొని పనిచేస్తుంది. మరీ ఈ సంవత్సరం థీమ్ ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం.
WHO 76వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. 2024 సంవత్సరం వేడుకలో భాగంగా WHO ‘నా ఆరోగ్యం, నా హక్కు’ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఈ ఏడాది థీమ్‌గా ఎంచుకుంది, ఇది ప్రాథమిక మానవ హక్కు, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, విద్య, సమాచారానికి ప్రాధాన్యత ఇచ్చింది. అక్టోబరు 24, 1945న స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి ప్రధాన లక్ష్యం ప్రపంచవ్యాప్త శాంతి, భద్రత, ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన పరిస్థితులను ప్రోత్సహించడం. మెరుగైన జీవనానికి ఒక ముఖ్యమైన అంశం ప్రజారోగ్యం. దీనిని పరిగణనలోకి తీసుకుని, ఐక్యరాజ్యసమితిని సృష్టించిన దౌత్యవేత్తలు అంతర్జాతీయ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవశ్యకతను చర్చించారు. ఏప్రిల్ 7, 1948 న ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. జనవరి 12, 1948న WHO రాజ్యాంగంలో భారతదేశం చేర్చబడింది.