Tattoo: టాటూలు వేయించుకుంటున్నారా? అధ్యయనాలు వద్దంటున్నాయ్!
ఇటీవల కాలంలో టాటూలు వేయించుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందనే చెప్పాలి. అయితే ఇవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న దానిపై ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. అందుకే ఈ కథనం.
Tattoo: వయసులో సంబంధం లేకుండా ఇప్పుడు చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు చాలా మంది టాటూలను వేయించుకుంటున్నారు. విదేశాల్లో అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉందనే చెప్పాలి. అందుకనే టాటూలు వేయడానికి ఉపయోగించే ఇంక్‌లు మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి? అనే విషయంపై న్యూయార్క్‌లోని బింగ్హామ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పరిశోధనలు చేశారు. వాటిలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.
టాటూ(Tattoo) ఇంకుల్లో ఉండే 45 సమ్మేళనాలు మనిషిలోని కొన్ని ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నట్లు ఆ పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే అందులో ఉండే ఆ సమ్మేళనాలు ఏంటనేదాన్ని మాత్రం వారు బయటపెట్టలేదు. ఇవి దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయని మాత్రం చెప్పారు. కొందరు ఏదో ఒక శరీర భాగంలో చిన్నగా టాటూలు వేయించుకుంటూ ఉంటారు. అవి కొంత వరకు ఫర్వాలేదు. కానీ కొందరు మాత్రం ఒళ్లంతా పెద్ద పెద్ద టాటూలు వేయించుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఆలోచించుకోవాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు.
టాటూల(Tattoos) వల్ల చర్మంపైన ఉండే శ్వేధ గ్రంథులకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరాన్ని చల్లబరచడం కోసం ఇవి చెమటను ఉత్పత్తి చేస్తాయి. అయితే టాటూల్ని వేయించుకున్న చోట ఉండే చమట గ్రంథులు సరిగ్గా పని చేయవు. అలాగే వీటి వల్ల ధనుర్వాతం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. పచ్చబొట్లు వేయడానికి ఉపయోగించే సూదులు ఒకరివి ఇంకొకరికి ఉపయోగించడం వల్ల కూడా ప్రమాదకరమైన జబ్బులు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ప్రమాదం ఉంది.