MBNR: రాష్ట్రంలో మరోసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాయలంలో నూతనంగా గెలిచిన కౌకుంట్ల మండల కాంగ్రెస్ సర్పంచ్‌లు నరేష్, శృతి అరవింద్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, గొల్ల కృష్ణయ్యలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు.
VKB: పెద్దెముల్ మండలం గాజీపూర్ సర్పంచ్ హేమలతా లాల్ రెడ్డి ఇవాళ శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, తన మద్దతు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. నసీరుద్దిన్, ఎండీ గౌస్, శ్రీనివాస్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
SRPT: కుష్టు వ్యాధిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం వెంపటిలో ఈ నెల 18 నుంచి 31 వరకు నిర్వహించే కుష్ఠు వ్యాధి నిర్ధారణ కార్యక్రమంపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రతి ఇంటింటికీ ఆశ కార్యకర్తలు వెళ్ళి స్పర్శ లేని రాగి రంగు మచ్చలను గుర్తించి ప్రజలకు చికిత్స అందించాలన్నారు.
NZB: ప్రధాన రహదారి పక్కన గల ఈత చెట్ల తొలగింపుపై బోధన్ ఎక్సైజ్ సీఐకి మోస్రా గ్రామ గౌడ సంఘం సభ్యులు మంగళవారం ఫిర్యా దు చేశారు. గ్రామ శివారులో ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన గల ఈత చెట్లను అన్యా యంగా తొలగించారని వాపోయారు. తమ జీవనానికి ఆధారమైన ఈత చెట్లను తొలగించడం సరికాదన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
KMM: జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తవడానికి మిగులు భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో భూసేకరణ ప్రక్రియ, నేషనల్ హైవే నిర్మాణ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నాగపూర్-అమరావతి ప్యాకేజీ-1, 2 భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల నూతన సర్పంచ్‌లను కలవనున్నట్లు తెలిపారు.
MNCL: జిల్లాలో జరగనున్న 3వ విడత ఎన్నికల కొరకు అవసరమైన ఏర్పాటు చేశామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని చెన్నూరు, మందమర్రి, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
MHBD: తొర్రూరు మండలం జీకే తండాకు చెందిన గుగులోతు కోట అనే రైతు ఇవాళ తన వ్యవసాయ పొలం వద్ద స్టాటర్ లో ఫీజ్ లు సరి చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు, ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడికి భార్య కాంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
NGKL: సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించేందుకు 14 ఏళ్ల బాలికలకు HPV టీకా వేయడం అత్యవసరమని జిల్లా వైద్యాధికారి డా. కె. రవికుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 9,500 మంది బాలికలు ఉన్నారని అంచనా వేసి, ఈ నెలలో జాబితా పూర్తి చేసి జనవరిలో టీకా కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు.
SRPT: ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నికలపై నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సిబ్బంది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. జిల్లాలో ఈ నెల 17న నిర్వహించే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగళవారం గరిడేపల్లి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు.
BDK: సంఘటిత, అసంఘటిత కార్మికులకు అండగా నిలబడి వారి హక్కులను పరిరక్షిస్తూ, నూతన హక్కులను సాధించి పెడుతుంది ఎర్ర జెండానేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్’లో మంగళవారం జరిగిన కొత్తగూడెం డివిజన్ హమాలీ కార్మికుల సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు.
BDK: నిత్యం అనేకమంది ప్రయాణించే చర్ల రోడ్లో నన్నపనేని స్కూల్ ఎదురుగా వీధిలైట్లు పనిచేయడం లేదు. గతంలో అనేకసార్లు ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. గ్రామపంచాయతీ ఈవోకి ఫిర్యాదు చేసిన అసలు స్పందించడం లేదు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు, పాదచారులు కోరుతున్నారు.
KMR: గత రాత్రి పెద్ద మల్లారెడ్డి శివారులో పులి ఆవును చంపినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, దాడి చేసి చంపింది చిరుత కాదు పెద్దపులి అని నిర్ధారించారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో గజగజ వణికిపోతున్నారు. గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు గ్రామస్థులకు జాగ్రత్తగా ఉండాలన్నారు.
JGL: కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప స్వామీ ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివాలయానికి ముత్యంపేట వాస్తవ్యులు, రశ్మీధర్ తేజ విద్యా సంస్థల అధినేత కొండాడి సంధ్యారాణి ఓరుగంటి వేంకటేశ్వర్ రావు దంపతులు రూ. 5,00,001/ లు విరాళం మంగళవారం రోజున అందజేశారని ఆలయ అధ్యక్షులు గురుస్వామి అంబటి శ్రీనివాస్ తెలిపారు.
NZB: బీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కే. చంద్రశేఖర్‌ను ఎకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు భీం ఆర్మీ జిల్లా అధ్యక్షులు అజయ్ రావణ్ అన్నారు. మంగళవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో బీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తన చేతుల మీదుగా బాధ్యత ఇచ్చినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.