Komati Reddy Venkat Reddy: ఇవన్ని కేసీఆర్ చేసిన పాపాలే
యాదగిరి గుట్ట పేరును మార్చి కేసీఆర్ తప్పు చేశాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం పేరుతో వేల కోట్లు దోసుకున్నారని మండిపడ్డారు.
Minister Komati Reddy Venkat Reddy criticized BRS leader KCR
Komati Reddy Venkat Reddy: తెలంగాణలో కేసీఆర్(KCR) చేసిన తప్పులు లెక్కలేవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Komati Reddy Venkat Reddy) అన్నారు. ఆయన చేసిన పాపాలే ఆయన్ను పాములా కాటేస్తున్నాయని విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడారు. గేట్లు తెరవకముందే కాంగ్రెస్లోకి తోసుకుని వస్తున్నారని.. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని తెలిపారు.
ఇంకా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని పేర్కొన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, డబ్బులు దన్నుకున్నారే తప్ప దాని వలన ఎవరికి ఒరిగింది ఏమిలేదన్నారు. తెలంగాణ సంపదను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల కరువు వచ్చిందన్నారు. యాదగిరి గుట్టలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. దీనిపై ఈ లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే విచారణ చేస్తామని వెల్లడించారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తామని, తిరిగి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు.