తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర చెరిగిపోనిది. నాడు సాయుధ పోరాటంలోనూ.. నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. అందుకే తెలంగాణలో ఇంకా ఆ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ బీఆర్ఎస్ తో కలసి నడవాలని నిర్ణయించాయి. మొన్న మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ తో కలిసి వేసిన పాచికలు విజయవంతం కావడంతో అదే వ్యూహాన్ని ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాటించాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. ప్రస్తుతం ఒంటరిగా వెళ్తే విజయవంతం కాలేమనే వాస్తవాన్ని గ్రహించారు. బీఆర్ఎస్ తో కలిసి వెళ్తేనే భవిష్యత్ ఉంటుందనే అభిప్రాయానికి సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు వచ్చినట్లు సమాచారం.
ఈ మేరకు ఇరు పార్టీలు గత కొద్దిరోజులుగా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లక్ష్యంగా చర్చలు సాగిస్తున్నాయి. బీఆర్ఎస్ తో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలి? సీఎం కేసీఆర్ ఎన్ని స్థానాలు ఆశించవచ్చు? ఎక్కడెక్కడ కలిసి పోటీ చేయవచ్చు? అనే లెక్కలు వేస్తున్నారు. మొత్తం 20 అసెంబ్లీ స్థానాలు తమకు కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. చెరో పది స్థానాల్లో పోటీ చేయాలని సీపీఐ, సీపీఐ(ఎం) భావిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, కమ్యూనిస్టుల ఉమ్మడి శత్రువు బీజేపీనే. జాతీయ రాజకీయాలు లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతుంటే కమ్యూనిస్టులు రాష్ట్రంలో బలంగా మారాలనే ప్రణాళికతో ఉన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కమ్యూనిస్టులతో కలిసి నడిచారు.
ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు, గులాబీ పార్టీ కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. కేసీఆర్ కు కమ్యూనిస్టుల అవసరం.. కమ్యూనిస్టులకు గులాబీ పార్టీ అవసరం ఉంది. దీంతో పరస్పర సహకారంతో కమ్యూనిస్టు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. కమ్యూనిస్టుల సహకారంతో మూడోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. దీంతో కమ్యూనిస్టు పార్టీలు కోరినన్ని సీట్లు సీఎం కేసీఆర్ ఇచ్చే అవకాశం ఉంది. తాము బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలో 20 సీట్లు సీపీఐ, సీపీఎం కోరుతున్నాయి.