తెలంగాణ(Telangana)లో కమలం పార్టీలో నూతనోత్తేజం నింపే ప్రయత్నానికి బీజేపీ (BJP) హైకమాండ్ సిద్ధమైంది. కాషాయ పార్టీ అగ్రనేతలు పర్యటించబోతున్నారు. కర్ణాటక ఓటమి.. నేతల చిట్ చాట్లతో కుంగిపోయిన బీజేపీలో పునరుత్తేజం నింపేపనిలో పార్టీ హైకమాండ్ పడింది. రాబోయే పక్షం రోజుల్లో ముగ్గురు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించబోతున్నారు. అటు బీఆర్ఎస్ (BRS) … ఇటు కాంగ్రెస్ ను దాటి ఎన్నికల రేసులో ముందు వరుసలో నిలబడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కర్ణాటక ఓటమి పాఠాల నుంచి నేర్చుకున్న అంశాలపై కమలనాథులు దృష్టిపెట్టారు. దక్షిణాదిన అధికారపగ్గాలు చేపట్టేందుకు అవకాశమున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని బీజేపీ భావిస్తోంది.
అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. కమల వికాసం కోసం పావులు కదుపుతున్నారు. ఖమ్మం (KHAMMAM) జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో అక్కడే అమిత్ షా (Amit Shah) తో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నెల 15న తెలంగాణ గుమ్మం ఖమ్మం ఖిల్లాలో అమిత్ షా సభను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు (Nagar Kurnool) జిల్లాలో ఈ నెల 25న నడ్డా పర్యటించనున్నారు. అమిత్ షా, నడ్డా పర్యటనలు ఫిక్స్ అయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై తెలంగాణ కమలనాథులు డ్రాఫ్ట్ రూపొందించారు. మోదీ పర్యటన తేదీలపై పీఎంఓ నుంచి గ్రీన్ సిగ్నల్ రావల్సి ఉంది. నెలాఖరున మోదీతో నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.