న్యూజిలాండ్ – భారత్ మధ్య నేడు రాత్రి ఏడున్నర గంటలకు టీ20 మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం భారత్ ఉత్సాహంతో ఉండగా, కివీస్ మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ తీవ్ర ఆసక్తిని రేపుతోంది. హార్దిక్ పాండే నేతృత్వంలోని భారత్ జట్టు తన జోరును కొనసాగిస్తుందని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి టీ20 శుక్రవారం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేకుండా… హార్దిక్ నేతృత్వంలోని జట్టు మరోసారి రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉంది. రాహుల్, షమి, సిరాజ్‌లకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు. వన్డే సిరీస్‌ను కివీస్ 0-3తో కోల్పోయింది. దీంతో టీ 20 లో నెగ్గాలని కసితో ఉంది.
శుభ్ మన్ గిల్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నాడు. వన్డే సిరీస్ లో అతడు పరుగుల వరద పారించాడు. ఇలాంటి ఫార్మాట్లలో సూర్యకుమార్ అదరగొడుతున్నాడు. ఇషాన్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్య, దీపక్ హుడాలతో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. సుందర్ కూడా ఉన్నాడు. ఇక పృథ్వీషా ఓపెనింగ్ ప్రత్యామ్నాయం. అయితే అతడికి నిరీక్షణ తప్పేలా లేదు. గిల్ ఓపెనింగ్ లో రానున్నాడు. గిల్ తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. బ్యాటింగ్ కి భారత్ మెరుగ్గా ఉంది. బౌలింగ్ లో మాత్రం కాస్త పుంజుకోవాల్సి ఉంది.
తుది జట్లు అంచనా… భారత్: శుభ్ మన్ గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి, సూర్య కుమార్, హార్దిక్, దీపక్ హుడా, సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్, కుల్ దీప్.