CM కేసీఆర్‌తో గవర్నర్ తమిళి సై కయ్యం.. ఈసారి ఎందుకంటే..?
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తిరస్కరించి, మరోసారి కయ్యానికి కాలుదువ్వారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.
Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ (Tamilisai Soundararajan) మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి కయ్యానికి కాలు దువ్వారు. గతంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం సిఫారసు చేసింది. అతను అర్హత లేదని పక్కన బెట్టింది. దీంతో తమిళి సై వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. అంతా కూల్ అనుకునేలోపే.. మరోసారి కయ్యానికి కాలుదువ్వారు.
దాసోజు, కుర్రా
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ సిఫార్సులను తమిళి సై తిరస్కరించారు. ఎందుకంటే ఆ ఇద్దరు నేతలు ఎక్కడ సేవ చేసినట్టు లేరని.. కేవలం వారి బయోడేటా మాత్రమే తనకు ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన నోట్లో పేర్కొన్నారు. ఈ చర్యతో ప్రగతి భవన్- రాజ్ భవన్ మధ్య మళ్లీ దూరం పెరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, మంత్రులు గవర్నర్ వైఖరిపై మండిపడుతున్నారు.
నేపథ్యం ఇదే
దాసోజు శ్రవణ్ తొలి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. పార్టీలో పదవీ దక్కడం లేదని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. సో.. అలా చాలా రోజులు ఆ పార్టీలో ఉన్నారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే అందులో ఉండగలిగారు. పీసీసీ చీఫ్ మారిన తర్వాత.. బీజేపీలోకి వెళ్లారు. అక్కడ సిద్దాంతాలు వేరు.. రకరకాల ఇబ్బందులతో తిరిగి సొంతగూటికి బీఆర్ఎస్లో చేరారు. చాలా రోజుల తర్వాత రావడం, పదవీ ఇవ్వకపోవడంతో దాసోజు శ్రవణ్ పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు సీఎం కేసీఆర్. ఇక కుర్రా సత్యనారాయణ విషయానికి వస్తే.. 1999లో సంగారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లో మాత్రం జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) చేతిలో ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉండటంతో నామినేట్ పదవీకి కేసీఆర్ ప్రతిపాదించారు. ఇలా శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదించారు.
సఖ్యత.. ఇప్పుడు దూరం
గత కొద్దీరోజుల నుంచి రాజ్ భవన్- ప్రగతి భవన్ మధ్య సఖ్యత ఉంది. సో.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో తమిళి సై ఇక కొర్రీ పెట్టదని అంతా అనుకున్నారు. కానీ శ్రవణ్, కుర్రా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయలేదని తిరస్కరించారు. మరోసారి కేసీఆర్ అండ్ కోతో గొడవకు సిద్దమయ్యారు. తమిళి సై ఇప్పటికీ బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని.. వెంటనే పదవీ నుంచి వైదొలగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అప్పుడే కలిసి.. ఆ వెంటనే
అంబేద్కర్ విగ్రహావిష్కరణకు గవర్నర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకలేదు. అదీ దుమారం రేగడంతో సచివాలయ ప్రారంభోత్సవానికి ఇన్వైట్ చేశారు. ప్రార్థనా మందిరాలను ప్రారంభించారు. తర్వాత ఓ సారి సీఎం కేసీఆర్‌ను కలిసి, ముచ్చటించారు. దీంతో అంతా సద్దుమణిగిందని అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. మళ్లీ డైలాగ్ వార్‌కు తమిళి సై కాలు కదిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల నుంచి రియాక్షన్ స్టార్ట్ అయ్యింది. దానికి గవర్నర్, బీజేపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలీ మరీ.