World breastfeeding week: ఈ వారాన్ని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2023గా జరుపుకుంటున్నారు. తల్లిపాల గురించి అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. తద్వారా తల్లీ బిడ్డలిద్దరి ఆరోగ్యం బాగుంటుంది. వైద్యులు ప్రకారం శిశువు పూర్తి పోషణకు తల్లి పాలు చాలా ముఖ్యమైనవి. తల్లి ఆరోగ్యానికి కూడా తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయి. దీంతో తల్లి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను దూరం చేసుకోవచ్చు. తల్లి పాలలో 400 రకాల పోషకాలు ఉన్నాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో.. అభివృద్ధి చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాలు శిశువుకు అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీబాడీలను కలిగి ఉంటాయి. ఇది వారి రోగనిరోధక శక్తికి చాలా మంచిది.
ఢిల్లీలోని గైనకాలజిస్ట్ డాక్టర్ చంచల్ శర్మ తల్లి పాలలో బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయని చెప్పారు. ఇది పిల్లల మానసిక వికాసానికి ఎంతో మేలు చేస్తుంది. తల్లి ఆరోగ్యానికి తల్లిపాలు కూడా చాలా ముఖ్యం. ఇది సహజంగా కొవ్వును తగ్గించడానికి తల్లి శరీరానికి సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది. దీని వల్ల స్త్రీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బిడ్డకు కూడా సమయానికి పూర్తి పోషకాహారం అందుతుంది.
బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టాలా?
అప్పుడే పుట్టిన బిడ్డకు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలని డాక్టర్ చంచల్ శర్మ చెప్పారు. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. తల్లిపాలు ఇచ్చే సమయంలో మీరు బిడ్డకు ఆహారం ఇచ్చే వైపున చేతితో శిశువు వెన్నెముక, మెడ, దిగువ వీపును నిమురుతూ ఉండాలి. ఇలా చేస్తే బిడ్డ తాగిన పాలు త్వరగా జీర్ణమవుతాయి.
ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి
పిల్లల ఆకలిని బట్టి పాలు పట్టించాలి. శిశువు బిగ్గరగా ఏడుస్తుంటే, అది ఆకలికి సంకేతంగా ఉంటుంది. మీరు వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి. తల్లి పాలిచ్చే సమయంలో తల్లి ఆరోగ్యకరమైన.. పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీని కారణంగా అన్ని పోషకాలు పాలలో చేరుతాయి. అది బిడ్డకు గొప్ప ప్రయోజనం ఉంటుంది. తల్లి పాలిచ్చే సమయంలో తల్లి తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండండి
పాలిస్తున్న తల్లులు మద్యం, పొగ త్రాగకూడదని డాక్టర్ చంచల్ చెప్పారు. దీని వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. ఇది పాల నాణ్యతను కూడా పాడు చేస్తుంది. ఈ సమయంలో పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి. మురికి ప్రదేశంలో బిడ్డకు ఎప్పుడూ పాలివ్వవద్దు.