• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ

SRPT: మోతే మండలం హుస్సేనాబాద్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఆగి ఉన్న లారీని, మరొక లారీ వెనక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

August 21, 2025 / 06:32 AM IST

రామంతాపూర్ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన లోకాయుక్త

MDCL: రామంతపూర్‌లోని గోఖలే నగర్‌లో కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో జరిగిన ఘటనపై లోకాయుక్త స్పందించింది విద్యుత్ షాక్‌తో ఐదుగురు చనిపోవడంపై సుమోటోగా కేసును లోకాయుక్త నమోదు చేసింది. దీనిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని మేడ్చల్ కలెక్టర్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, టీజీఎస్పీడీసీఎల్‌ఎస్ఈ, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్‌లకు నోటీసులు జారీచేసింది.

August 21, 2025 / 06:32 AM IST

కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు: కలెక్టర్

WGL: యూరియా కొరత, ఇతర వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం రైతులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 18004253424, ఫోన్ నంబర్లు 0870-2530812, 91542529360 తమ సమస్యలను పరిష్కరించుకోవాలని బుధవారం ఆమె కోరారు.

August 21, 2025 / 06:30 AM IST

ఈనెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

అనకాపల్లి జిల్లాలో ఈనెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో పీజీఆర్ఎస్ అర్జీలు, భూములు క్రమబద్ధీకరణ, అన్నదాత సుఖీభవ, తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇళ్ల స్థలాల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

August 21, 2025 / 06:29 AM IST

ప్రభుత్వ ఐటీఐలో ఖాళీలకు ఆహ్వానం

SKLM: శ్రీకాకుళంలోని బలగ ప్రభుత్వ ఐటీఐలో 3వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్‌రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26లోగా https://iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 27న ధ్రువపత్రాలు వెరిఫికేషన్‌తో పాటుగా 29న తమ కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మహిళలకు టైలరింగ్ కోర్సుల్లో కూడా ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

August 21, 2025 / 06:28 AM IST

కొల్లేరు సర్వేపై సమీక్షించిన అధికారులు

W.G: కొల్లేరు పరీవాహక ప్రాంతంలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియపై బుధవారం ఆకివీడు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వేయర్ జాషువా సమీక్షించారు. డివిజన్, మండల స్థాయి సర్వేయర్లకు సర్వే ప్రక్రియను వేగవంతంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, సర్వేయర్లు పాల్గొన్నారు.

August 21, 2025 / 06:24 AM IST

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌కు నలుగురు ఎంపిక

అల్లూరి: పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చేసే పరిశోధనకు ఎంపికయ్యారు. ఎంపికైన వైద్య విద్యార్థులు ప్రొఫెసర్ రాధాకుమారి ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ నియమ నిబంధనలను అనుసరించి పరిశోధనలు చేస్తారు. విద్యార్థులు ఐసీఎంఆర్ పరిశోధనలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ డీ.హేమలతదేవి అన్నారు.

August 21, 2025 / 06:23 AM IST

గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

ADB: గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఎస్సై విష్ణుప్రకాష్ బుధవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా మహాలక్ష్మీవాడకు చెందిన మసూద్, మహారాష్ట్రకు సల్మాన్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని తనిఖీ చేయగా రూ.6,075 విలువైన 243 గ్రాముల ఎండు గంజాయి లభించిందన్నారు.

August 21, 2025 / 06:21 AM IST

లత్తవరంలో సచివాలయ నిర్మాణం పూర్తి

ATP: ఉరవకొండ మండలంలోని లత్తవరం గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ సచివాలయం నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. గ్రామంలో ప్రభుత్వ పాలన మరింత సమర్థవంతంగా సాగనుంది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

August 21, 2025 / 06:21 AM IST

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

KRNL: జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే అర్జీల్లో 85 శాతం రెవెన్యూకు సంబంధించినవేనని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి.రంజిత్ బాషా హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశం భవనంలో రెవెన్యూ అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీవో, సర్వేయర్లతో కలెక్టర్ నిన్న సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే నాలుగైదు సార్లు చెప్పానని, ఇక ఉపేక్షించేది లేదని అన్నారు.

August 21, 2025 / 06:17 AM IST

15 గేట్ల ద్వారా ‘పులిచింతల’ నీటి విడుదల

SRPT: చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు 4,45,187 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో బుధవారం రాత్రి అధికారులు 15 గేట్లను నాలుగున్నర మీటర్ల మేర పైకి ఎత్తి 4,81,102 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్‌కో 16,600 క్యూసెక్కుల నీటితో 4 యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

August 21, 2025 / 06:17 AM IST

అత్తా, కోడళ్ల మధ్య ఘర్షణ.. అత్త మృతి

VZM: జామి మండలం జడ్డేటివలసలో ఆస్తి తగాదా కారణంగా అత్తా, కోడళ్ల మధ్య జరిగిన ఘర్షణలో అత్త గూనూరు కొండమ్మ మృతి చెందింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో పెద్ద కోడలు విజయ కనకలక్ష్మి అత్తను నెట్టడంతో ఆమె కిందపడి అక్కడికక్కడే మరణించింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు జామి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

August 21, 2025 / 06:17 AM IST

మిగిలిన సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి

ATP: గుంతకల్లు స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఈ ఏడాది వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ యస్.బద్రీ నాథ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డ్రాఫ్ట్మన్ సివిల్, ఎలక్ట్రిషీయన్, ఫిట్టర్, మెకా నిక్ మోటర్ వెహికల్, మెకానిక్ డీజిల్, కోప కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను మూడవ విడత కింద భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

August 21, 2025 / 06:17 AM IST

‘సామాజిక మాధ్యమాలతో జాగ్రత్తగా ఉండాలి’

MNCL: విద్యార్థులు సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని భరోసా టీం కోఆర్డినేటర్ జీవిత సూచించారు. బుధవారం ఆసిఫాబాద్ ZPSSలో విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. సోషల్ మీడియా వేధింపులు, ఈవ్‌ టీజింగ్, మహిళల అక్రమ రవాణా, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

August 21, 2025 / 06:16 AM IST

మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు చోరీ

కోనసీమ: ద్రాక్షారామం మండలం వెంకటాయపాలెం గ్రామంలో చోరీ ఘటన బుధవారం చోటుచేసుకుంది. లిటిల్ రోజ్ స్కూల్ హెచ్ఎం తంగిరాల జయసంతోషి విష్ణుప్రియ స్కూటీపై ఇంటికి వెళ్తుండగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న 6 కాసుల బంగారు పుస్తెల తాడు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

August 21, 2025 / 06:13 AM IST