తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీఆర్ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. మిగతా రాష్ట్రాలలో పోటీ చేస్తే పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో పోటీ అనేసరికి ఆయనపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. సామాన్యుల నుండి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు సంధిస్తున్నారు. కొంతమంది పార్టీ రావొచ్చు.. పోటీ చేయవచ్చు కానీ విభజన సమస్యలను ఎలా పరిష్కరిస్తారని నిలదీస్తున్నారు. రాయలసీమ నాయకులు అయితే ప్రత్యేకంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన అడుగుతున్నారు. వీరు కేసీఆర్ పార్టీపై కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రాజెక్టులపై క్లారిటీ కోరుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హయాంలో కేసీఆర్ పని చేయడంతో ఆయనతో ఏపీ నేతలకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అనంతపురం జిల్లా నేతలతో మరింత సాన్నిహిత్యం ఉంది. బీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్లడానికి కొన్ని రాయలసీమ సంఘాలు వెనుకాడటం లేదు. అయితే వెనుకబడిన తమ ప్రాంతానికి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి స్పష్టమైన వైఖరితో వస్తే కలిసేందుకు సిద్ధమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై కూడా స్పష్టత కావాల్సిందే అంటున్నారు.
పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, శ్రీశైలైం నుండి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల, విద్యుదుత్పత్తిపై బీఆర్ఎస్ ఏం చేస్తుందో చెప్పాలని అడుగుతున్నారు. తెలంగాణ విద్యుదుత్పత్తిని నిలిపివేసి, నిబంధనల ప్రకారం నీటి మట్టాలను నిర్వహిస్తే, రాయలసీమ ప్రాంతంలో తాగు నీరు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుందని, అలాంటి సానుకూల ప్రకటన వస్తే ఈ ప్రాంతంలో పార్టీ పునాది వేయవచ్చునని చెబుతున్నారు. తెలంగాణ వైఖరి కారణంగా ఇక్కడి నాలుగు ముఖ్యమైన ప్రాజెక్టులు స్ట్రగుల్ అవుతున్నాయని చెబుతున్నారు. గత ఏడు దశాబ్దాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతోందని, తమకు ఇప్పుడు న్యాయం జరగడం కావాలంటున్నారు.