ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం జగన్ ని విమర్శిస్తూ ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రతిపక్ష టీడీపీ చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా…. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గురు, శుక్ర, శని వారాల్లో గుంటూరు, బాపట్లలో పర్యటించనున్నారు. నేడు పెదకాకాని, నారాకోడూరు, పొన్నూరులో పర్యటన ఉంటుంది. నారాకోడూరులో రైతులతో సమావేశం కానున్నారు. రాత్రి పొన్నూరులో బస చేయనున్నారు. శుక్రవారం ముస్లింలతో సమావేశం అవుతారు. అనంతరం బాపట్ల జిల్లాలో చుండూరుపల్లి, అప్పికట్ల గ్రామాల్లో ప్రజలతో మాట్లాడతారు. రాత్రి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బస చేస్తారు. శనివారం అదే కళాశాలలో ఎస్సి విద్యార్థులు, మహిళలతో విడివిడిగా ముచ్చటించనున్నారు.
ఇందుకోసం రూట్‌మ్యాప్‌ని పార్టీ కార్యాలయం ఖరారు చేసింది. బైక్‌ర్యాలీలు, రోడ్డు షోలు, బహిరంగ సభలు, విద్యార్థులు, ఎస్సీలు, మైనార్టీలతో ముఖాముఖీ సమావేశాలు నిర్వహించి వారు ఎదుర్కొంటోన్న సమస్యలను ఎక్కడికక్కడ అధినేత తెలుసుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, బాపట్ల ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మతో పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల పార్టీ నాయకులు భారీగా జనసమీకరణ చేస్తోన్నారు.
నారాకోడూరు గ్రామం వద్ద అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్‌షో, బహిరంగ సభకు అశేష జనవాహిని హాజరయ్యేలా కార్యకర్తలు ప్రతిఒక్కరిని కలిసి ఆహ్వానాలు పలుకుతున్నారు.
చంద్రబాబు పర్యటన మార్గమంతా కార్యకర్తలు ఎక్కడికక్కడ బ్యానర్లు, జెండాలు, పసుపు తోరణాలతో అలంకరించారు..ఇక నిన్న జరిగిన బిసి సభపై చంద్రబాబు స్పందించారు. టిడిపి బిసిల గుండెల్లో ఉంటుందని తెలిపారు. టిడిపి డిఎన్ఎ బిసిలు అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. జయహో బిసి స్లోగన్ టిడిపిదేనని తెలిపారు.