ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలో మార్చి 5న శ్రీ ఆది జాంబవ అరుంధతి హిందూ మాదిగ అన్నదాన సత్రానికి భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని అందరి సాయంతో సత్రం నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. సత్ర నిర్మాణ కమిటీ పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని డొక్కా తెలిపారు. భక్తుల నుంచి విరాళాలు సేకరించడంలో జవాబుదారితనం ఉండాలని, కమిటీ పెద్దలకు తెలిసే అని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
శ్రీశైలంతో పాటు తిరుపతి, యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాల్లో హిందూ మాదిగ సత్రాల మంజూరుకు త్వరలో శ్రీకారం చుడతామని ఎమ్మెల్సీ చెప్పారు. సత్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. నిర్మాణంలో సలహాలు సూచనలు కూడా ఇచ్చి ముందుకు నడిపించాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హిందూ మాదిగల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాణిక్య ప్రసాద్ కోరారు. శ్రీశైలంలో సత్రం మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు.