అమెరికా మంచు తుఫానుతో వణికిపోతోంది. ఈ చలికాలంలో భారీగా కురుస్తున్న మంచుకు తోడు గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్లలోకి పడిపోయాయి. అమెరికాలో 200 మిలియన్లకు (20 కోట్లు) పైగా అమెరికన్లపై ఈ మంచు తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. 1.5 మిలియన్లకు పైగా ప్రజలు విద్యుత్ లేక అల్లాడుతున్నారు. శుక్రవారం వేలాది విమానాలు రద్దయ్యాయి. టెక్సాస్ నుండి క్యూబెక్ వరకు 3200 కిలో మీటర్ల మేర భారీ మంచు తుఫాను ప్రభావం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం అమెరికాలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోయింది. విద్యుత్ సరఫరా లేక, బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెన్సిల్వేనియా, మిచిగాన్, న్యూయార్క్ తదితర చోట్ల భారీ మంచు తుఫాను ఉండే అవకాశముందని జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. 89 సెంటిమీటర్ల మంచు తుఫాను ఉండవచ్చునని పేర్కొంది. దాదాపు ఎనిమిది మిలియన్ల మంది అంటే 80 లక్షల మంది ఉన్న ప్రాంతంలో ప్రమాదకర హెచ్చరికలు ఉన్నాయి. న్యూఇంగ్లాండ్, న్యూయార్క్, న్యూజెర్సీలలో ఫ్లడింగ్లో మునిగాయి. సౌత్ డకోటా ప్రాంతంలో నడుస్తున్న ఆవులు, ఇతర జంతువులను చూస్తే, మొత్తం మంచుతో కనిపిస్తున్నాయి. శరీరం పైన మొత్తం మంచు కనిపిస్తోంది. అమెరికాలో 5600 విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీలలో నీట మునిగిన కార్లు, వాహనాలు కనిపిస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 10 లక్షల మంది ఇళ్లలో పూర్తిగా కరెంట్ లేదని తెలిపారు.