చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభలో అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో మారీచులు, పెత్తందారులతో యుద్ధం తప్పదన్నారు. చంద్రబాబు, ఆయన వర్గీయులు ఏ వర్గానికి ప్రతినిధులో అందరికీ తెలిసిందే అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తారని, వారు పెత్తందారుల వైపు ఉంటారన్నారు. కానీ జగన్ ఎప్పటికీ ప్రజల హృదయంలో ఉంటారన్నారు. సామాజిక న్యాయం వైసీపీలోనే ఉంటుందన్నారు. మానవతావాదానికి వైసీపీ ప్రతీక అన్నారు. 2024లో మరోసారి నిజాయితీకి, వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అద్భుత విజయం సాధిస్తుందన్నారు.
మనం చేసిన ప్రతి పనిని గడపగడపకు తీసుకు వెళ్లాలని, జగనన్న మంచి చేశాడని భావిస్తేనే అండగా ఉండమని చెప్పాలని సభకు హాజరైన వారికి చెప్పారు. చంద్రబాబు హయాంలో దోచుకోవడం, పంచుకోవడం, తినడం చేశారన్నారు. చంద్రబాబు చేసే అసత్య ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబు కొన్ని వర్గాలను హేళన చేశారని, కానీ మనం అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు. గత ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను తాము అమలు చేశామని, ఆర్థిక సాధికారత కోసం రూ.3 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. టీడీపీ హయాంలో అప్పు పెరుగుదల 19 శాతం కాగా, ఇప్పుడు దానిని 15 శాతానికి తగ్గించామన్నారు.
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి నాలుగున్నర దశాబ్దాలు అవుతోందని, తన వయస్సు 49 ఉందని, అయినా తనతో పోటీ పడేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని, అందుకే 2024లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పలేకపోతున్నారన్నారు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదని, బ్యాక్ బోన్ అన్నారు జగన్. బీసీలు రాజకీయ సాధికారతకు నిదర్శనంగా నిలిచారన్నారు. బీసీల హృదయంలో జగన్, జగన్ హృదయంలో బీసీలకు చోటు ఉందన్నారు. రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యమని చంద్రబాబుకు గుర్తు చేయాలన్నారు. చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, మేం అన్నింటిని నెరవేర్చామని చెప్పారు. ఖబడ్దార్ మీ అంతు చూస్తామని కూడా చంద్రబాబు బీసీలను బెదిరించారన్నారు. నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబుకు బుద్ది చెప్పాలన్నారు. చంద్రబాబు చేసిన మోసాలు, నయవంచనను బీసీలకు గుర్తు చేయాలన్నారు. శాశ్వత బీసీ కమిషన్ను దేశంలోనే తొలిసారి ఏపీలో ఏర్పాటు చేశామన్నారు.