Bomb Threat : దేశంలోని వివిధ విమానాశ్రయాలు, టెర్మినల్స్‌పై బెదిరింపు దాడుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ‘టెర్రరిస్ట్స్ 111’ అనే సంస్థ ఈ బెదిరింపును జారీ చేసింది. ఈ బెదిరింపు సంస్థ చాలా మందికి ఇమెయిల్ ద్వారా అందించింది. ఆ తర్వాత దేశంలోని అన్ని విమానాశ్రయాలు, టెర్మినళ్ల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. టాప్ సైబర్ సెక్యూరిటీ, IT ఏజెన్సీలు అనుమానాస్పద ఇమెయిల్‌ల మూలాన్ని కనుగొనడంలో బిజీగా ఉన్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు అనుమానాస్పద ఇమెయిల్ పంపబడింది. ఇందులో నాగ్‌పూర్ విమానాశ్రయంపై దాడి చేస్తామని బెదిరించారు. దీంతో నాగ్‌పూర్ సిటీ పోలీస్ కమిషనర్ రవీంద్ర సింఘాల్ అతని బృందం వెంటనే విమానాశ్రయానికి చేరుకుని ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. బ్లాస్ట్ డిటెక్షన్, పేలుడు పదార్థాల తొలగింపు బృందాలను నియమించారు. నాగ్‌పూర్‌తో పాటు జైపూర్, గోవా విమానాశ్రయాలపై కూడా బాంబు దాడి జరుపుతామని మరో మెయిల్ వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ ఇమెయిల్‌లో, ‘ప్రతిచోటా రక్తం ఉండేలా చూస్తాము. వీలైనంత ఎక్కువ మందిని చంపాలనుకుంటున్నాము.’ టెర్రరిస్ట్స్ 111 అనే సంస్థ దీని వెనుక ఉందని ఈమెయిల్లో పేర్కొంది. కొన్ని విమానాల్లో బాంబులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈమెయిల్ అందిన తర్వాత అన్ని విమానాశ్రయాలు, వివిధ సంస్థల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. దీంతో సీఐఎస్ఎఫ్కు కూడా ఇబ్బందులు తప్పలేదు. అయితే, క్షుణ్ణంగా విచారణ జరిపి, ఎటువంటి ముప్పు కనిపించకపోవడంతో ఇది ఎవరో పిచ్చివాడి పని అయి ఉంటుందని భద్రతా అధికారులు అంచనా వేస్తున్నారు. అనుమానాస్పద ఇమెయిల్ వచ్చిన తర్వాత, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ యాక్టివేట్ చేయబడింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో లగేజీని సోదా చేశారు. అయితే అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. కొద్దిరోజుల పాటు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయని, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉంటాయని భద్రతా అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయంతో పాటు, ఒక ప్రధాన పరిశ్రమ వర్గానికి కూడా బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దీంతో పాటు ఓ బ్యాంకు, ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్ కంపెనీ, న్యూస్ పేపర్లకు కూడా బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. సీఐఎస్ఎఫ్ అగర్తల, గయా, ఇంఫాల్, శ్రీనగర్, వారణాసి యూనిట్లకు కూడా ఇదే ఇమెయిల్ వచ్చింది.