ఛత్తీస్‌గఢ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. తన బిడ్డ అంత్యక్రియల కోసం సాయం చేయాలని అభ్యర్థిస్తూ రెండురోజుల పాటు ఓ తల్లి ఇళ్లిళ్లూ తిరిగింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన కాంకేర్ జిల్లా మలంజికుండంలో చోటు చేసుకుంది. మన్సుగవాడే అనే మహిళకు లక్ష్మణ్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత వారికి ఓ ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టాక మన్సుగవాడే అనారోగ్యానికి గురయింది. భర్త చికిత్స చేయించేందుకు నిరాకరించాడు. భార్య, కూతురును వారి మానాన వారిని వదిలేశాడు. పుట్టింటివాళ్లు కూడా కూతురును, మనవరాలిని ఆదరించలేదు. పౌష్టికాహారం లేక బిడ్డ ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఫిబ్రవరి 4వ తేదీన కన్నుమూసింది పాప. కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా మన్సుగవాడే వద్ద రూపాయి లేదు. దీంతో బిడ్డ మృతదేహాన్ని భుజంపై వేసుకొని, శనివారం ఉదయం నుండి ఆదివారం రాత్రి వరకు సాయం కోసం ఎన్నో ఇళ్లను తిరిగింది. ఈ విషయం తెలిసిన కాంకేర్ జిల్లా అధికారులు అంత్యక్రియలు జరిపారు. అయితే ఆ తల్లి మానసికస్థితి కూడా బాగా లేదని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిని సఖి కేంద్రానికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు.