Chennai Rains: చెన్నైకు మరోసారి రెడ్ అలర్ట్..ఐఎండీ హెచ్చరిక
తమిళనాడులోని చెన్నై నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
మొన్నటి వరకూ మిచౌంగ్ తుఫాన్ వల్ల భారీ వరదలు సంభవించాయి. ఆ వరదల నుంచి కోలుకోకముందే ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడులోని చెన్నై నగరాన్ని వర్షాలు వదలడం లేదు. వర్షం వల్ల ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అయ్యాయి. వరదల వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని చెన్నై వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మరో మూడు రోజుల పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు డిసెంబర్ 17వ తేదీన కేరళ, లక్షద్వీప్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆ రెండు రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.