»Ratna Bhandar Of Puri Jagannath Temple Reopened For Shifting Of Valuables
Ratna Bhandar : పూరీ రత్నభండార్ లోపలి గదిలో ఆభరణాలు అక్కడి నుంచి తరలింపు
పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్నభండార్ లోపలికి గదిని అధికారులు గురువారం మళ్లీ తెరిచారు. అక్కడున్న విలువైన ఆభరణాలను తరలించేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Puri Jagannath Temple : ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న రహస్య లోపలి గదిని అధికారులు మళ్లీ తెరిచారు. ఈ గదిని తెరవడం ఈ వారంలోనే ఇది రెండో సారి. అక్కడ ఉన్న అతి విలువైన ఆభరణాలను(Valuables) తాత్కాలికంగా స్ట్రాంగ్ రూంకి తరలిస్తున్నారు. గురువారం ఉదయం ముందు స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం 9:51 గంటలకు ఈ గదిని మళ్లీ తెరిచారు. అక్కడున్న అన్ని వస్తువులనూ స్ట్రాంగ్ రూంకి తరలించే పనిలో పడ్డారు. ఈ సాయంత్రం వరకు ఈ పనులు జరుగుతాయని కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వంత్ రాథ్ వెల్లడించారు.
పూరీ జగన్నాథ ఆలయం(Puri Jagannath Temple )లోని, రత్నభండార్ బయటి గదిలో ఉన్న అమూల్యమైన వస్తువులను ఈ నెల 14న స్ట్రాంగ్ రూంకి తరలించిన విషయం తెలిసిందే. పూరీ రాజు గజపతి మహారాజ దివ్య సింగ్ దేబ్ సమక్షంలో ఈ ఆభరణాల తరలింపు కార్యక్రమాన్ని ప్రస్తుతం చేపట్టారు. ఈ షిఫ్టింగ్ పూర్తయిన తర్వాత రత్న భాండార్‌లోని ఇన్నర్ ఛాంబర్‌కి తిరిగి సీల్ వేయనున్నారు. త్వరలో దీనికి పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ కారణంగానే ఆభరణాలు అన్నింటినీ స్ట్రాంగ్ రూంకి తరలిస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఈ పనులన్నీ జరుగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా పూరీ రత్న భండార్‌పై(Ratna Bhandar) దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. 46 ఏళ్ల తర్వాత ఈ రహస్య గదిని తెరిచేందుకు అధికారులు సమాయత్తం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. నాలుగు రోజుల క్రితం ఈ గదుల్ని ఓపెన్ చేసిన అధికారులు, గురువారం మరో సారి రత్నభాండార్ లోపలి గదిని తెరిచారు. అందుకోసం అక్కడ పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం సీసీటీవీల పరిధిలోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది.