కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర జమ్మూ కశ్మీర్ లో సాగుతోంది. కాగా… ఈ నెలాఖరుకి ఆయన యాత్ర ముగిసే అవకాశం ఉంది. ఆయన యాత్రకు నేతలు, ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. ఇక, రాహుల్ గాంధీ యాత్రకు అనుభవాలకు సంబంధించి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ఎదురైన అనుభవాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ఇంటి వద్ద ఉన్నప్పుడు సాధారణంగా దేశీయ వంటకాలనే ఇష్టపడతానని, వాటికే ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
ఇక సాయంత్రం డిన్నర్ సమయంలో ఎక్కువగా విదేశీ వంటకాలు, కాంటినెంటల్ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పర్యటించిన సమయంలో తీసుకున్న ఆహారంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ రుచులు చాలా స్పైసీగా ఉంటాయని, ఆ స్పైసీ రుచులు అమోఘమని కితాబిచ్చారు. అటువంటి వంటలు ఉత్తర భారతావనిలో లభ్యంకావని తెలిపారు. తెలంగాణకు వెళ్లిన సమయంలో అలాంటి వంటలు తీసుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ రుచులను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.