»No Decision Taken On Karnataka Chief Minister Surjewala
Randeep Surjewala : కర్ణాటక ముఖ్యమంత్రిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : సూర్జేవాలా
కర్నాటక తదుపరి సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)పేరు ఖన్ఫామ్ అయినట్లు వార్తలు వినిపిస్తోన్న వేళ కర్నాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా(Randeep Surjewala) కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక (Karnataka) తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా (Randeep Surjewala) ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒక నిర్ణయానికి రాగానే వెంటనే తెలియజేస్తామని మీడియాకు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎం సిద్ధరామయ్యేనంటూ జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమన్న కొద్దిసేపటికే రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మీడియా ముందుకు వచ్చారు. సాధ్యమైనంత తొందర్లోనే ఒక నిర్ణయం తీసుకుంటామని మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) చెప్పారని, ప్రస్తుతం ఎవరూ ఎలాంటి ఊహాగానాలు చేయడం కానీ, వదంతులు వ్యాప్తి చేయడం కానీ చేయవద్దని కోరారు.
రాబోయే 48 నుంచి 72 గంటల్లో కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని సూర్జేవాలా వివరించారు.ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై నాలుగైదు రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే పార్టీ సిద్ధరామయ్య (Siddaramaiah) వైపు మొగ్గు చూపుతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని సిద్ధూ వైపు మొగ్గు చూపుతున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం మాజీ ముఖ్యమంత్రికే ఆ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజో రేపో ప్రకటన వెలువడగానే గురువారం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. అయితే డీకే శివకుమార్(DK Sivakumar) కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.