NEET UG 2024: నీట్ యూజీ పేపర్‌కు సంబంధించిన వివాదం ఇప్పట్లో ముగిసిపోయే సూచనలు కనిపించడం లేదు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా పరీక్షలో కాపీయింగ్ పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. ఈ అంశం సుప్రీం కోర్టుకు కూడా చేరింది. అక్కడ విచారణలో ఉంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటివరకు 16 మంది నిందితులను అరెస్టు చేసింది. వీరిలో ఎక్కువ మంది బీహార్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారే.
ఇంతలో ఎన్టీఏ నీట్ 2024 పరీక్ష సవరించిన ఫలితాలను శనివారం విడుదల చేసింది. విశేషమేమిటంటే పరీక్షకు హాజరైన ఏ విద్యార్థికి కూడా 700 మార్కులు రాలేదు. నీట్ యూజీ పరీక్షలో 67 మంది విద్యార్థులు టాపర్‌గా నిలవడంపై వివాదం మొదలైంది. జూన్ 4న పరీక్ష ఫలితాలు వెలువడ్డగా అందులో 67 మంది టాపర్లుగా నిలిచారు. మొత్తం 67 మంది టాపర్లు 720 మార్కులకు గాను 720 మార్కులు సాధించారు. దీంతో అక్కడ వివాదం నెలకొంది.
ఇందులో కూడా హర్యానాలోని ఝజ్జర్‌లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్లో ఆరుగురు టాపర్ విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఒకే కేంద్రంలో 718, 719 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. సవరించిన ఫలితాల్లో ఈ కేంద్రంలోని 494 మంది విద్యార్థుల ఫలితాలు విడుదలయ్యాయి. వారిలో 33 మంది విద్యార్థులు 500, ఎనిమిది మంది 600 పైన ఉన్నారు. జార్ఖండ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడి ఒయాసిస్ స్కూల్లో 22 మంది విద్యార్థులు 600 కంటే ఎక్కువ మార్కులు కలిగి ఉన్నారు. ఎవరికీ 700కంటే ఎక్కువ మార్కులు సంపాదించ లేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న విడుదలైన ఫలితాల్లో నిలిచిన టాపర్లు అన్ని మార్కులు ఎలా సాధించారనేది ప్రశ్న.
హర్యానాకు చెందిన ఝజ్జర్, గుజరాత్‌లోని గోద్రా పరీక్షా కేంద్రం ఈ విషయమై వివాదాస్పదమైంది. ఝజ్జర్ సెంటర్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు పరీక్షలో 720 మార్కులు సాధించారు. ఈ కారణంగా ఈ కేంద్రం వివాదంలోకి వచ్చింది. గోద్రాలోని పరీక్షా కేంద్రం నుంచి ఐదు రాష్ట్రాల విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ రెండు కేంద్రాల్లోనూ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.