Michaung Cyclone: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా నగరం మొత్తం జలమయం అయ్యింది. ఇప్పటికే స్కూళ్లు, కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎడతెడపి వర్షాలకు లోతట్టు ఇళ్లు, కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీధుల్లో ఉన్న వాహనాలు వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఎయిర్పోర్ట్ సైతం నీట మునిగింది. రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో రైళ్లను రద్దు చేసి మూసివేశారు.
గత 24 గంటల్లో చెన్నైలో 20 సెం.మీ నుంచి 29 సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా నీటిలో వాహనాలు తేలియాడుతున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. తమిళనాడులోని చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. ఎవరూ కూడా బయటకు రావద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు. కాంతూరు ప్రాంతంలో గోడకూలి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కిల్పా మెడికల్ కాలేజీ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వర్షపు నీరు చేరడంతో రోగుల్లో భయం మొదలైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి నీటిలో చిక్కుకున్న వారిని కాపాడారు.