విక్రమ్ ల్యాండ్, ప్రజ్ఞాన్ రోవర్లను రేపు యాక్టివేట్ చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రునిపై మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఇవి పనిచేస్తే ఇస్రో మరో చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్3 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం అక్కడ స్లీప్ మోడ్లో ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. ఆగస్టు 23వ తేదిన చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి విక్రమ్ ల్యాండర్ చేరింది. తాజాగా అవి స్లీప్ మోడ్లో ఉన్నాయి. వాటిని నిద్రలేపే పనిలో ఇస్రో పడింది.
చంద్రుడిపై నెలలో సగం రోజులు పగలు, మిగిలిన రోజుల్లో చీకటి ఉంటుంది. ఈ నేపథ్యంలో 14 రోజుల రాత్రి పూర్తవ్వడంతో అక్కడ సూర్యోదయం అయ్యింది. సెప్టెంబర్ 22వ తేదిన ల్యాండర్, రోవర్లను యాక్టివేట్ చేయాలని ఇస్రో మొదట నిర్ణయించినప్పటికీ అకస్మాత్తుగా దానిని వాయిదా వేసింది.
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను తిరిగి యాక్టివేట్ చేసే ప్రక్రియను శనివారం రోజుకు ఇస్రో వాయిదా వేసింది. ఈ విషయాన్ని తాజాగా ఇస్రో వెల్లడించింది. శుక్రవారం సాయంత్రమే నిద్రలేపే ప్రక్రియను చేపట్టాలనుకున్నా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వాయిదా వేసినట్లుగా స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. ఇప్పటి వరకూ చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్3 పలు పరిశోధనలు చేసింది.
చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద లూనార్ నైట్ సందర్భంగా మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అక్కడి వాతావరణ పరిస్థితులను అవి తట్టుకుని తిరిగి పని చేస్తాయా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఒకవేళ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి పని చేస్తే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో చరిత్ర సృష్టించినట్లే అవుతుంది.