»Tollywood Star Comedian Visweswara Rao Passed Away
Vishweshwar Rao : హాస్య నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత
టాలీవుడ్లో ప్రముఖ హాస్య నటుడు విశ్వేశ్వరరావు మంగళవారం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నై సమీపంలోని ఆయన స్వగ్రామం సిరుశేరిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Vishweshwar Rao passed away : తెలుగులో ప్రముఖ హాస్య నటుడు విశ్వేశ్వరరావు (62) మంగళవారం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. కాస్ట్యూమ్ డిజైనర్ ‘దాసి’ సుదర్శన్, మాటల రచయిత శ్రీరామకృష్ణ మరణ వార్తల నుంచి కోలుకోకముందే తాజాగా విశ్వేశ్వర రావు మరణించారు. దీంతో తెలుగు చిత్ర సీమ విషాదంలో మునిగిపోయింది.
విశ్వేశ్వరరావు స్వస్థలం కాకినాడ. తర్వాత చెన్నై సమీపంలో స్థిరపడ్డారు. బాల నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టారు. కేవలం బాల నటుడిగానే 150కిపైగా చిత్రాల్లో నటించారు. పొట్టి ప్లీడరు చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. బాల్యంలోనే భక్త పోతన, బాల మిత్రుల కథ, ఓ సీత కథ, మా నాన్న నిర్ధోషి, పట్టిందల్లా బంగారం, బాల భారతం, నిండు హృదయాలు, అందాల రాముడు, ఇంటి గౌరవం వంటి చిత్రాల్లో నటించారు. ప్రముఖ హాస్య నటుడు రాజబాబు చిన్ననాటి పాత్రల్లో ఎక్కువగా నటించేవారు.
తర్వాత ఆయన సహాయ పాత్రల్లో మెప్పించారు. ముఠామేస్త్రీ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ఆమె కథ, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివాజీ, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు… వంటి చిత్రాల్లో హాస్య నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు 150కి పైగా సీరియల్స్‌లోనూ నటించారు.