వివాదాలకు పెట్టింది పేరు ఆర్జీవీ. ఆయనకు సంబంధం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి… ఎవరికీ అసవరం లేకపోయినా అభిప్రాయాలు చెబుతూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో తాను హాట్ టాపిక్ గా ఉంటే చాలు అని భావిస్తూ ఉంటాడు. తాజాగా… చిరంజీవి- గరికపాటి వివాదంలోనూ ఆర్జీవీ వేలు పెట్టడం గమనార్హం.
మెగాస్టార్ చిరంజీవిపై ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. మెగాస్టార్ అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను తప్పుబట్టారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం గరికపాటి వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే..’ అని ఐదు రోజుల క్రితం ట్వీట్ చేశారు.
అయితే, సోమవారం రాత్రి నాగబాబు ట్వీట్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నాగబాబు ట్వీట్‌ను సపోర్ట్ చేస్తూ ఎమోజీలతో రీట్వీట్ చేశారు. అంతటితో ఆగని వర్మ.. గరికపాటిపై వరుస ట్వీట్లలో ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు.
గరికపాటిపై మొదట ఘాటుగా ట్వీట్ చేసిన నాగబాబు.. ఆ తరవాత ‘గరికపాటి వారు ఏదో మూడ్‌లో అలా అని ఉంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రిక్వెస్ట్’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై కూడా వర్మ స్పందించారు.
‘ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్‌ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం, త్తగ్గేదెలె…’ అని వర్మ రీట్వీట్ చేశారు.
అక్కడితో ఆగకుండా.. ‘హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’ అని ఒక ట్వీట్లో.. ‘హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి’ అని వ్యంగ్యంగా అవమానిస్తూ మరో ట్వీట్లో పేర్కొన్నారు వర్మ. ఈ ట్వీట్స్ పై అందరూ విమర్శలు చేస్తుండటం గమనార్హం.