ఈసారి దసరా బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉండబోతోంది. నిన్నటి వరకు బాలయ్య దసరాకు వస్తాడా.. లేదా.. అనే డౌట్స్ ఉండేవి. కానీ సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ రేసులోకి వచ్చేశారు నందమూరి నటసింహం. మరి దసరానే నమ్ముకున్న మాస్ మహారాజా రవితేజ, బోయపాటి శ్రీను పరిస్థితేంటి.. దసరా వార్ అనుకున్న దానికంటే గట్టిగా జరగబోతోందా.. ఎవరు తగ్గుతారు.. ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే దసరా సందర్భంగా అక్టోబర్ 20న రాబోతున్నట్టు రామ్, బోయపాటి ప్రకటించేశారు. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా ఇదే. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. దాంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఇక రామ్‌కు పోటీగా మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగిపోయాడు. రవితేజ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వర రావు’ ని దసరా సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే దసరా సీజన్ అంటే.. దాదాపు పది రోజులు హాలీడేస్ ఉంటాయి. కాబట్టి.. రవితేజ, రామ్ మధ్య పోటీ ఓకే అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్లిద్దరికి గట్టి పోటీ ఇచ్చేందుకు బాలయ్య కూడా బరిలోకి దిగిపోయాడు. ప్రస్తుతం బాలయ్య బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో NBK 108 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాను కూడా దసరాకే రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. విజయదశమికి ఆయుధ పూజ చేయబోతున్నట్టు.. సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఇక బాలయ్య రాకతో రామ్, రవితేజకు టఫ్ ఫైట్ తప్పేలా లేదు. అది కూడా బాలయ్య వర్సెస్ బోయపాటి అనేసరికి ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటి వరకు ఈ ఇద్దరు కలిసి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కానీ మొదటి సారి వేర్వేరుగా తలపడేందుకు రెడీ అవుతున్నారు. ఇక మాస్ మహారాజా కూడా రేసులో ఉండడంతో.. ముగ్గురిలో ఎవరు హిట్ కొడతారు.. బాలయ్య కోసం బోయపాటి వెనక్కి తగ్గుతాడా.. రవితేజ సై అంటాడా.. అనేది వేచి చూడాల్సిందే!