UK VISA: భారతీయులకు షాక్.. బ్రిటన్ వీసాకు కొత్త రూల్స్!
బ్రిటన్ ఎన్నికల నేపథ్యంలో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ముఖ్యంగా వీసాకు సంబంధించి కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఆ కొత్త రూల్స్ అమలులోకి వస్తే భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
2024లో బ్రిటన్ (United Kingdom)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్ (Rishi Sunak) ప్రభుత్వం బ్రిటన్ లోకి వలసలను నిరోధించేందుకు ప్రణాళిక వేస్తోంది. అందులో భాగంగా అధిక వేతనాలు ఉన్నవారికే ఉపాధి వీసాలు దక్కేలా కొత్త నిబంధనను (New Rules) అమలు చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ హౌస్ ఆఫ్ కామన్స్తో ఓ బిల్లును కూడా ప్రవేశ పెట్టారు. ఒక వేళ ఈ బిల్లుకు ఆమోదం దక్కితే భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా వీసా నిబంధనల్లో బ్రిటన్ సర్కార్ పలు మార్పులు చేసినట్లు వెల్లడించింది. బ్రిటన్ స్కిల్డ్ వర్కర్ వీసా (Britan skilled Worker Visa) పొందేందుకు గతంలో కనీస వేతనం 26,200 పౌండ్లు ఉండగా తాజాగా ఆ వేతనాన్ని 38,700 పౌండ్ల వరకూ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపోతే కుటుంబ వీసాకు గతంలో కనీస వేతనం 18,600 ఉండగా ప్రస్తుతం దాన్ని కూడా 38,700 పౌండ్లకు చేర్చింది.
మరోవైపు హెల్త్ అండ్ కేర్ వీసాదారులు (Health and Care Visas) ఇకపై తమ కుటుంబీకులను బ్రిటన్కు తీసుకొచ్చే అవకాశం ఉండదు. కేర్ క్వాలిటీ కమిషన్ పర్యవేక్షణలోని కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే వారు ఇతరులకు వీసాను స్పాన్సర్ చేసే అవకాశం ఉంటుంది. స్టూడెంట్ వీసాపై ఈ కఠిన నిబంధనలు అమలు కానున్న తరుణంలో చాలా వరకూ వలసలు కూడా తగ్గిపోయే అవకాశం ఉందని బ్రిటన్ సర్కార్ భావిస్తోంది.