»Last 17 Minutes Terror In Chandrayaan 3 Land Time
Chandrayaan-3 ఆ చివరి 17 నిమిషాలు కీలకం: ఇస్రో
మరికొన్ని గంటల్లో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడనుంది. ఆ అధ్భుత క్షణాలు చూసేందుకు యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ల్యాండర్ ల్యాండ్ అయ్యే చివరి 17 నిమిషాలు కీలకం అని ఇస్రో ప్రకటించింది.
Chandrayaan-3: మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 (Chandrayaan-3) విక్రమ్ ల్యాండర్ అడుగిడబోతుంది. ల్యాండ్ అయ్యే చివరి 17 నిమిషాలు కీలకం అని.. ఆ టైమ్ టెర్రర్ టైమ్ అని ఇస్రో మాజీ చీఫ్ శివన్ గతంలో చెప్పారు. ఆ సమయమే ఫలితాన్ని నిర్దేశిస్తోందని వివరించారు. ఈ రోజు ల్యాండర్ సేఫ్‌గా దిగితే చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోతుంది.
వెలుగు రాగానే ల్యాండ్
ల్యాండింగ్ మాడ్యూల్ కదలికలను శాస్త్రవేత్తలు నిశీతంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రదేశంలో సూర్యోదయం కోసం వేచి చూస్తున్నామని.. వెలుగు రాగానే ల్యాండింగ్ ప్రక్రియ చేపడతాని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాయంత్రం 5.45 గంటలకు ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం 6.04 గంటలకు ముగియనుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సేఫ్‌గా అడుగిడాలని యావత్ భారతావని కోరుకుంటుంది.
90 డిగ్రీల కోణంలో
ఎగుడు దిగుడు ఉపరితలంలో భారీ బిలాలతో ఉండే దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 (Chandrayaan-3) ల్యాండర్ దిగాల్సి ఉంది. సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలానికి చంద్రయాన్-3.. 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటుంది. నిలువుగా ల్యాండింగ్‌కు సిద్ధం చేయడంతో ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గణిత సూత్రాలను క్రోడీకరించి సిమ్యులేషన్ తయారు చేశామని.. ఆ సిమ్యులేషన్‌లో తేడా రావడంతో చంద్రయాన్-2 (Chandrayaan-2) సక్సెస్ కాలేదని శివన్ వివరించారు. ఇంధనాన్ని తక్కువ వినియోగిస్తూ.. దూరాన్ని సరిగ్గా అంచనా వేసి ఉపగ్రహాన్ని వెర్టికల్ పొజిషన్లోకి తీసుకురావాల్సి ఉంటుంది.
వేగాన్ని తగ్గిస్తూ..
అడ్డంగా పరిభ్రమించే సమయంలో చంద్రయాన్ (Chandrayaan) గంటలకు 6048 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. దానిని 1290 కిలోమీటర్ల వేగానికి తగ్గించాలి. తర్వాత వెర్టికల్ పొజిషన్‌కు వచ్చిన తర్వాత వేగం మరింత తగ్గి.. గంటకు 220 కిలోమీటర్లకు చేరాలి. రఫ్ బ్రేకింగ్ ఫేస్‌గా పిలిచే ప్రక్రియ మొత్తం 690 సెకన్లలో ముగిసిపోవాలి. ఈ ఫీట్ చేసే సమయంలో చంద్రుని ఉపరితలంపై 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి 7.42 కిలోమీటర్ల ఎత్తుకు వచ్చేస్తోంది. చంద్రుని గగనతలంలో 713.5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. 7.42 కిలోమీటర్ల ఎత్తు చేరుకున్న తర్వాత ఆల్టిట్యూట్ హోల్డింగ్ ఫేస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో రాకెట్ పైకి నేరుగా ఎలా వెళుతుందో.. అంతే నేరుగా చంద్రునిపై దిగడానికి ఉపగ్రహం తన స్థితిని పూర్తిగా మార్చుకుంటుంది. తర్వాత ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. 12 డిగ్రీల వంపుతో ల్యాండ్ అయినా ఉపగ్రహం సురక్షితంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.