Coconut Oil: కొబ్బరి నూనె సహజ సన్ స్క్రీన్ లోషన్‌లా పనికొస్తుందా?
మార్కెట్లో దొరికే ఖరీదైన సన్‌స్క్రీన్ లోషన్లకు బదులుగా కొబ్బరి నూనెలో కొన్ని కలిపి వాడటం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
మనం ఎండలోకి వెళ్లినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు మన చర్మం మీద పడతాయి. ఈ యూవీ కిరణాల్లో ప్రధానంలో యూవీఏ, యూవీబీ అనే రెండు రకాల కిరణాలు మన చర్మంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. యూవీఏ కిరణాలు చర్మం లోతులకు చొచ్చుకుపోతాయి. అందువల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. యూవీబీ కిరణాలు మాత్రం చర్మం బయటి వైపు ఉన్న పొరలపై ప్రభావాన్ని చూపుతాయి. ట్యానింగ్, వడదెబ్బ తగలడం లాంటి సమస్యలు దీని వల్ల తలెత్తుతాయి. అందుకే ఎండలోకి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ తప్పని సరి అని చెబుతారు.
కొబ్బరి నూనెలో సహజ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే దీని మీద చేసిన పరిశోధనల ఫలితాలు ఇలా ఉన్నాయి. యూవీబీ కిరణాల నుంచి ఇది రక్షణ కలిగించే లక్షణాలను కలిగి ఉంది. అది మార్కెట్లో దొరికే మంచి సన్ స్క్రీన్ లోషన్లతో పోలిస్తే చాలా తక్కువ శాతం మాత్రమే. దీని రక్షణ శాతం మరింత పెరగాలంటే మాత్రం వర్జిన్ కోకోన్ ఆయిల్‌కి రాస్బెర్రీ సీడ్ ఆయిల్, జింక్ ఆక్సైడ్లను కలపాలి. అప్పుడు దీని ఎస్పీఎఫ్ విలువ మెరుగవుతుంది. సన్‌స్క్రీన్ (sun screen) లా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది.
మార్కెట్లలో దొరికే సన్ స్క్రీన్ ఎంత రక్షణ ఇస్తుందనేది దాన్ని… సన్ ప్రొటక్షన్ ఫ్యాక్టర్ (SPF) అంటారు. ఎస్పీఎఫ్ విలువ 50గా ఉంటే అది మిమ్మల్ని యూవీబీ కిరణాల నుంచి 98శాతం వరకు రక్షిస్తుందని అర్థం. అలాగే ఎస్పీఎఫ్ విలువ 30గా ఉంటే అది యూవీబీ కిరణాల నుంచి 96.7శాతం రక్షిస్తుందన్నమాట. ఇప్పటి వరకు ఏ సన్ స్క్రీన్లోషన్ వల్లా ఈ కిరణాల నుంచి 100 శాతం రక్షణ కలగడం లేదు. మార్కెట్లో ఖరీదైనవి కొనుక్కోవడానికి ఇష్ట పడని వారు ఇలా కొబ్బరి నూనె(Coconut Oil)ను తయారు చేసుకుని వాడటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.