కాలులో ప్లేట్ తొలగింపు సమయంలో ఎముక విరిగినా తక్షణమే చికిత్స అందించక బాలుడిని మానసిక, శారీరక ఇబ్బంది కలిగించినందుకు బాధితుడికి 9 శాతం వడ్డితో రూ.6 లక్షలను వైద్య ఖర్చులకు 20 వేలు అదనంగా చెల్లించాలంటు కామినేని ఆసుపత్రి లిమిటెడ్, డాక్టర్ రోషన్ జైశ్వాల్ కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
A shock to Kamineni Hospital.. Orders to pay 6 lakhs
Kamineni Hospital: కాలులో అమర్చిన ప్లేట్ తొలగించే సమయంలో ఎముక విరిగింది. విషయం తెలిసినా తక్షణం చికిత్స(treatment) అందించక మానసిక, శారీరక వేదనకు గురి చేసినందున బాధితుడికి 9 శాతం వడ్డీతో రూ.6 లక్షల పరిహారాన్ని, ఖర్చుల కింద రూ.20 వేలను చెల్లించాలంటూ కామినేని ఆసుపత్రి లిమిటెడ్, డాక్టర్ రోషన్ జైశ్వాల్‌కు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్(State Consumer Commission) ఆదేశించింది. 4వ తరగతి చదువుతున్న సాయినాథ్ పక్షవాతం(Paralysis)తో బాధపడుతుండడంతో, కానిస్టేబుల్ అయిన తండ్రి చంద్రకాంత్ ఆరోగ్య భద్రత పథకం కింద నడకలో మెరుగు కోసం సన్‌షైన్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసీ ప్లేట్లు అమర్చారు. రెండేళ్ల తరువాత ప్లేట్లను తొలగించాలని డాక్టర్లు చెప్పగా.. సన్‌షైన్ ఆసుపత్రిలో ఆ పథకం అమలులో లేకపోవడంతో ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రి(Kamineni Hospital)లో ఆపరేషన్ చేశారు.
డాక్టర్ రోషన్ జైశ్వాల్ 2017 ఆగస్టు 30న శస్త్రచికిత్స చేసి విద్యార్థి కాలులోని ప్లేట్‌ను తొలగించారు. అప్పటినుంచి బాలుడు తీవ్ర నొప్పితో బాధపడుతుండడంతో మళ్లీ డాక్టరును సంప్రదించారు. ఎక్స్‌రేలో ఎముక విరిగి ఉండడం గమనించిన రోషన్ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎముక బలహీనంగా ఉందని, అలా వదిలివేయాలని, లేదంటే తిరిగి అదే ప్లేట్ శాశ్వతంగా అమర్చాలని సలహా ఇచ్చారు. కొద్ది రోజుల గడిచిన తగ్గకపోవడంతో తిరిగి ఆపరేషన్ నిర్వహించి సెప్టెంబరు 4న డిశ్ఛార్జి చేశారు. అసలు విషయం తెలుసున్న తండ్రి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మందులకు, ఫిజియోథెరపీకి నెలకు 10 వేల చొప్పున ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, అందుకు రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో చంద్రకాంత్ ఫిర్యాదు చేశారు.
దీనిపై కమిషన్ సభ్యులు వి.వి.శేషుబాబు, ఆర్.ఎస్.రాజశ్రీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వైద్య సేవల్లో ఎలాంటి లోపం లేదని డాక్టర్ రోషన్ జైశ్వాల్ రాత పూర్వకంగా పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు, సాక్షులను, ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం తప్పును కప్పిపుచ్చుకోవడానికి రికార్డులను తారుమారు చేయడానికి ప్రయత్నించారంది. బాధితుడికి రూ.6 లక్షల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో చెల్లించాలని, ఖర్చుల కింద రూ.20 వేలు అందజేయాలని ఆసుపత్రిని, వైద్యుడిని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.