Bhupesh Baghel: మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఈడీ నివేదిక ఆధారంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ఎలక్షన్ల ముందు మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ బయటకు వచ్చింది. అప్పట్లో ఈ కేసు విషయాలు ఈడీ తెలియజేసింది. ఛత్తీస్‌గఢ్ సీఎంగా ఉన్న బఘేల్‌కు యాప్ ప్రమోటర్లు రూ.508 కోట్లు ఇచ్చినట్లు ఆరోపించారు. తన సహచరులు ఈ కేసులో అరెస్టయిన తర్వాత యూఏఈకి పారిపోవాలని బఘేల్ సలహా ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇది బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం అని బఘేల్ ఖండించారు.
ఈడీ తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం బఘేల్‌తో పాటు యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రాకర్, శుభమ్ సోనీ, అనిల్‌కుమార్ అగర్వాల్ సహా మొత్తం 18 మందిపై ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయడం రాజకీయ వేధింపులో భాగమేనని ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజనందగావ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బఘేల్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రంలో ఓటమి తప్పదన్న భయంతోనే భాజపా ఈ ఎత్తులు వేస్తోందన్నారు. మహదేవ్ యాప్‌పై తన ప్రభుత్వం 72 ఎఫ్ఐఆర్లు నమోదుచేసి, దాదాపు 450 మందిని అరెస్టు చేసిందన్నారు.