West Bengal:పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌లోని గ్రామ పంచాయతీ స్థానిక బాలికను ప్రేమిస్తున్నందుకు పాఠశాల ఉపాధ్యాయుడికి 8 లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత గ్రామస్తులు యువకుడిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. స్థానికులు కొట్టడంతో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. పశ్చిమ మేదినీపూర్ జిల్లా చంద్రకోన బ్లాక్ 2 శ్రీరాంపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పశ్చిమ మేదినీపూర్‌లో ఓ ఉపాధ్యాయుడిని దారుణంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అతని తల రక్తంతో తడిసి పోవడం వీడియోలో కనిపిస్తోంది. చెట్టుకు కాళ్లు, చేతులు తాడుతో కట్టివేశారు. స్థానికులంతా అతనిని కొట్టడం కనిపిస్తోంది. అంతేకాకుండా అతడిపై దుర్భాషలాడుతున్నారు. చాలా మంది ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు. ఈ ఘటన సమయానికి అక్కడకు భారీగా జనం గుమికూడారు. కానీ, ఆ టీచర్ని కాపాడేందుకు ఎవరూ రాలేదు. ఇప్పటికే ఈ ఘటప కెమెరాకు చిక్కి పలువురి ఫోన్లలో హల్ చల్ చేస్తోంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన పశ్చిమ మేదినీపూర్ జిల్లా చంద్రకోన బ్లాక్ 2 శ్రీరాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన ఓ కళాశాల విద్యార్థిని కేశ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరడోల్ పాఠశాల ఉపాధ్యాయుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. కొద్దిరోజుల క్రితం సదరు ఉపాధ్యాయుడు తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు పట్టుకున్నారు. లోకల్ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావు? అని ఆ ప్రాంత వాసులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అనంతరం దారుణంగా కొట్టారు. అనంతరం పంచాయతీలో మధ్యవర్తిత్వ సమావేశం నిర్వహించారు. విద్యార్థిని కుటుంబానికి ఉపాధ్యాయుడు రూ.8 లక్షల పరిహారం ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు.