టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్(Ravi Prakash)కు రిపబ్లిక్ టీవీ (Republic Tv) షాకిచ్చింది. ట్రేడ్ మార్క్(Trade Mark) ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణతో ఆర్టీవీ(R TV) అధినేత రవిప్రకాశ్ పై రిపబ్లిక్ టీవీ రూ.100 కోట్ల దావా వేసింది. తమకు న్యాయం జరగాలని రిపబ్లిక్ టీవీ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా తమ పిటిషన్ను వినాలని రిపబ్లిక్ టీవీ కోర్టును కోరింది. అయితే రిపబ్లిక్ టీవీ వాదనలు వినేందుకు కోర్టు అంగీకరించలేదు. తాము లోగోను మార్చామని, ఆ విషయంలో కేంద్ర ప్రసార సమాచార మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆర్టీవీ యాజమాన్య కంపెనీ రాయుడు విజన్ మీడియా(Rayudu Vision Media) కోర్టుకు తెలిపింది.
R అనే అక్షరంతో తమకు ట్రేడ్ మార్కు ఉందని, అయినా కూడా రాయుడు టీవీ అదే అక్షరాన్ని ఉపయోగిస్తోందని రిపబ్లిక్ టీవీ (Republic Tv) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టుకు వాదనలు వినిపించింది. అయితే రాయుడు టీవీ కూడా ఇంకా ఆ లోగోను వాడటం ప్రారంభించలేదని, అందుకు అనుమతి రావాల్సి ఉందని తెలిపింది. ఈ పిటీషన్ పై తక్షణ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు కూడా అభిప్రాయపడింది.
R TV పేరుతో యూట్యూబ్ చానెల్ ఇప్పటికే నడుస్తున్నదని రిపబ్లిక్ (Republic Tv) తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రిపబ్లిక్ టీవీ ప్రారంభించేందుకు ముందే 2016 నుంచి రాయుడు కుటుంబం పేరుతో R TV నడుస్తున్నదని రాయుడు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను జూన్ 5వ తేదికి వాయిదా వేసింది.