కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్న సమయంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టార్ బీజేపీకి నిన్న రాజీనామా చేసి, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీలో విపక్ష నేతగా పని చేసారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి తీవ్ర అసంతృప్తికి గురైన శెట్టార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో టిక్కెట్ దక్కని ఆశావహులు, అనుచరులతో కలిసి ఆయన కాంగ్రెస్ సిద్ధం చేసిన రెండు విమానాల్లో హుబ్బళ్లి నుండి బెంగళూరుకు వెళ్లారు. అక్కడ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్, మాజీ మంత్రి ఎంబీ పాటిల్ తో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బెంగళూరులోని కార్యాలయంలో హస్తం పార్టీలోకి వెళ్లారు.
ఈ సందర్భంగా శెట్టార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీనియర్ నేతగా తనకు టిక్కెట్ వస్తుందని భావించానని, కానీ తనకు రాకపోవడంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. కనీసం తనతో మాట్లాడటానికి కూడా ఎవరూ ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. తాను రాజీనామా చేయకుండా ఎవరూ తనను బుజ్జగించే ప్రయత్నాలు చేయలేదన్నారు. ఎలాంటి పదవి ఇస్తామని గానీ, పార్టీలో ఉండాలని గానీ ఏ స్థాయి నేత కనీసం సంప్రదించలేదన్నారు. శెట్టార్ సొంతగా గెలవడంతో పాటు మరిన్ని సీట్లు గెలిపించే సత్తా కలిగిన నాయకుడు అని ఖర్గే ప్రశంసించారు. కర్నాటకలో బీజేపీ ఇప్పటికే పోటీ చేసే వారి పేర్లను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ రాని వారు కాంగ్రెస్, ఇతర పర్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు.
కాంగ్రెస్ నేతలు ఏమన్నారంటే?
శెట్టార్ చేరికతో కర్నాటకలో కొత్త చాప్టర్, కొత్త చరిత్ర, కొత్త ప్రారంభం కనిపిస్తోందని రణ్ దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.
శెట్టార్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని సిద్ధరామయ్య అన్నారు. కర్నాటక రాజకీయాల్లో ఆయనకు మంచి పేరు ఉందని, ఆరెస్సెస్ వ్యక్తి, సెక్యులర్ నేత అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీలో నిజాయితీ కలిగిన కార్యకర్త అన్నారు.
పార్టీలో చేరడానికి శెట్టార్ నుండి ఎలాంటి డిమాండ్లు లేవని, తాము కూడా ఎలాంటి డిమాండ్ చేయలేదని డీకే శివకుమార్ చెప్పారు.
ముఖ్యమంత్రి స్పందన
వీరేంద్ర పాటిల్, బంగారప్ప, దేవరాజ్ ఉర్స్ లను బహిష్కరించిన పార్టీలోకి జగదీశ్ శెట్టార్ వెళ్ళారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ఆయన రాజీనామా బాధాకరమే అన్నారు. ఎన్నికల తర్వాత ఇప్పుడు చేసిన సన్మానం వలె గౌరవిస్తారో చూద్దామని ప్రశ్నించారు. ఆయనను కాంగ్రెస్ వాడుకొని వదిలేయడం పక్కా అన్నారు. యడ్యూరప్ప ఉన్నంత వరకు లింగాయత్ లు మా వెంటే ఉంటారని చెప్పారు.