కాంగ్రెస్ పార్టీ నేతలం అందరం కలిసే ఉన్నామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ‘మేమంతా ఒక్కటే… మా నాయకులం కలిసే ఉన్నాం.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వచ్చి ఎన్నికల్లో ప్రజలు బి అర్ ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తమకు ఓటు వేసి గెలిపించేందుకు ఆత్రుతగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. 2024 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా సోమవారం వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. కేవలం బీ ఆర్ ఎస్ నేతలు మాత్రమే కాదని, బీజేపీ నేతలు కూడా భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నష్టం జరుగుతున్నా అమరుల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ సరైన పరిపాలన జరగక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారిందన్నారు. తెలంగాణ అన్నింటా వెనుకబడిందని చెప్పారు.
నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎనభై వేలమంది రైతులు, 3 వేల మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇప్పటికే 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం పూర్తి కాలేదని, కానీ తన ప్రగతి భవన్ మాత్రం 9 నెలల్లో పూర్తి అయ్యింది అన్నారు. వరంగల్ ఎమ్మెల్యేలు దండు పాళ్యం ముఠా అని, వరంగల్ ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలు బిల్లా రంగాల్లా ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.
వరంగల్ ఎమ్మెల్యేలను ఎవరిని తీసుకున్నా ఉద్యమ సమయంలో వీరి వద్ద ఏమి లేదన్నారు. ఇప్పుడు వేలకొట్లకు పడగెత్తారని మండిపడ్డారు. వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ పసిపిల్లగాడు అనుకుంటున్నారని, కానీ ఆర్టీసీ టైర్ల ఫ్యాక్టరీని మూసివేసి హంటర్ సెంటర్లో 6 ఎకరాల భూమిని కాజేసిన ఘనత ఆయనదన్నారు. దండుపాళ్యం ముఠాకు హన్మకొండ సాక్షిగా హెచ్చరిక చేస్తున్నానని, గోడ మీద రాసిపెట్టుకోండి… రోజులు లెక్కపెట్టుకోండి… డైరీలో ప్రతి ఒక్కటీ నోట్ చేసుకుంటున్నాం.. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధించిన ముఠాకు ఇంతకింత మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ దండుపాళ్యం బ్యాచ్ ను ఇంకెంతో కాలం భరించలేమన్నారు.