Controversy: రూ.2 కోట్లు ఇవ్వాల్సిందే..వివాదంలో ఆస్కార్ డైరెక్టర్!
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఇండియా ఖాతాలో మరొక ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రాగా.. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విష్పరర్స్(Elephant Whisperers)' మరో ఆస్కార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ వివాదంలో చిక్కుకున్నారు.
తమిళనాడు ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏనుగుల సంరక్షకులుగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల యథార్థ జీవితం ఆధారంగా.. ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్(Elephant Whisperers )’ తెరకెక్కించింది దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్. ఈ ఫీచర్ ఫిల్మ్ 95వ ఆస్కార్ వేడుకల్లో ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఇదే వేదిక పై దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళితో పాటు.. ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్(Kartiki Gonsalves), నిర్మాత గుణీత్ మోంగాను దేశమంతా అభినందించారు. పలువురు ప్రముఖులు వీరిని పిలిపించి సన్మానాలు చేసి మరీ అభినందించారు.
కానీ తాజాగా వీళ్లు వివాదంలో చిక్కుకున్నారు. ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ సినిమాలో నటించిన నిజమైన ఏనుగు సంరక్షకులు బొమ్మన్, బెల్లి కార్తికి గోన్సాల్వేస్ నుంచి రూ.2 కోట్లు కోరుతూ లీగల్ నోటీసులు(legal notices) పంపించారు. ఈ సినిమా తీసే సమయంలో తమకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి.. ఆ తర్వాత మాట తప్పారని బెల్లీ, బొమ్మన్ దంపతులు నోటీస్‌లో పేర్కొన్నారు. అలాగే.. షూటింగ్ అప్పుడు డబ్బు సహాయం కూడా చేశాము. దాదాపు లక్ష రూపాయల వరకు డైరెక్టర్‌కి ఇచ్చాము. ఆ తర్వాత సహాయం చేస్తామని, తమ మనవరాలి చదువుకు హెల్ప్ చేస్తామని చెప్పారు. కానీ ఆస్కార్ వచ్చాక ఓ సన్మాన కార్యక్రమంలో కనీసం ఆ అవార్డు మమ్మల్ని ముట్టుకోనివ్వలేదు. ఒక్క సహాయం కూడా చేయలేదు.. ఆమెకి ఫోన్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు అని అన్నారు. అయితే వీరు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని.. చిత్ర నిర్మాణ సంస్థ చెబుతోంది. మరి ఈ గొడవ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.