హిండెన్ బర్గ్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్ కకావికలమవుతోంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వారం పది రోజుల్లోనే షేర్లు మూడింతలు నష్టపోయాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. అదే సమయంలో హిండెన్ బర్గ్ విశ్వసనీయత పైన కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు మరో విషయాన్ని వెల్లడించాయి. అదానీ గ్రూప్‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఆ బ్యాంకులకు ఎలాంటి ఇబ్బంది లేదని రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలైన ఫిచ్, మూడీస్ ఈ అంశంపై స్పందించాయి. వివిధ భారతీయ బ్యాంకులు అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాలు పెద్ద మొత్తం లేవని, కాబట్టి ఇబ్బంది లేదని వెల్లడించాయి. క్రెడిట్ ప్రొఫైల్‌కు ఎలాంటి నష్టం లేదని తెలిపాయి.
అదానీ గ్రూప్‌నకు ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే, ప్రభుత్వ బ్యాంకులే అధిక రుణాలు ఇచ్చాయని, అయితే అవి ఒక శాతానికి తక్కువే ఉన్నాయని వెల్లడించాయి. అదానీ మరింతగా బ్యాంకులపై ఆధారపడితే మాత్రమే వాటిపై ప్రభావం చూపుతాయని తెలిపాయి. హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్‌కు అంతర్జాతీయ మార్కెట్ నుండి మాత్రం నిధుల ప్రవాహం తగ్గవచ్చునని అంచనా వేశాయి. ఎస్బీఐ రూ.27వేల కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7వేల కోట్లు అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇచ్చాయి. యాక్సిస్ బ్యాంకు రుణాల్లో అదానీ గ్రూప్ వాటా 0.94 శాతం.