Maharashtra till have drinking water, irrigation water problem
KCR:మహారాష్ట్రలో కొన్ని చోట్ల ఇప్పటికీ సాగు, తాగు నీరు అందడం లేదు.. ఇదీ ఎవరి పాపం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (kcr) అడిగారు. గోదావరి, కృష్ణా, పెన్ గంగా నదులు ఉన్నా మహారాష్ట్రకు నీటి కష్టాలు ఎందుకు అన్నారు. ఈ రోజు ఆయన శంభాజీనగర్ బహిరంగ సభలో మాట్లాడారు. ముంబై (mumbai) దేశ ఆర్థిక రాజధాని.. తాగేందుకు నీళ్లు ఉండవని గుర్తుచేశారు. ఇప్పటికైనా దేశం అభివృద్ది చెందుతుందా..? వెనక్కి వెళుతుండా అని అడిగారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా.. సమస్యలు మాత్రం తీరడం లేదన్నారు.
ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని కేసీఆర్ గుర్తుచేశారు. దేశంలో మార్పు జరగాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలు గెలవడం కాదు.. ప్రజల ఆకాంక్ష గెలవడం ముఖ్యం అన్నారు. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందన్నారు. పరివర్తన రానంతవరకు ఇలానే ఉంటుందని చెప్పారు. చైనా ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరుకుంది. సింగపూర్, కొరియా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని కేసీఆర్ గుర్తుచేశారు.
ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని కేసీఆర్ స్పష్టంచేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. సొంతంగా బీఆర్ఎస్ కార్యాలయ నిర్మిస్తాం అని చెప్పారు. మహారాష్ట్రలో తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఐదేళ్లలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్లో గల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగేనీటిని ఆదిలాబాద్ జిల్లాలో గల ఆదివాసీ, గోండు ప్రజలు కూడా తాగుతున్నారని గుర్తుచేశారు. మహారాష్ట్రలో ఇంటింటికీ నీరు ఇస్తామని.. ప్రతీ ఎకరాకు సాగునీరు అందజేస్తామని పేర్కొన్నారు. ఉచితంగా విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని తెలిపారు.
మార్పు తీసుకొచ్చేందుకే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని కేసీఆర్ పేర్కొన్నారు. కులం, మతం, వర్గం కోసం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించలేదని.. దేశంలో మార్పు తీసుకొచ్చేందుకు ఏర్పడిందని తెలిపారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. బీజేపీ కుట్రలకు భయపడితే దేశంలో ఏ పార్టీ మనుగడ సాధించలేదన్నారు.