జార్కాండ్ లో ఓ అమానుషమైన ఘటన జరిగింది. ఓ యువతి పెళ్లికి నిరాకరించినందుకు గుండు గీసి, మెడలో చెప్పులదండ వేసి ఊరేగించారు. ఈ ఘటన జార్ఖండ్ పాలము జిల్లా లోని జోగిదిహ్ గ్రామంలో జరిగింది. 24 ఏళ్ల ఓ గిరిజన యువతికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. తన ఇద్దరు అక్కలు, అన్నతో కలిసి నివసొస్తోంది. ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందుకు యువతి అంగీకరించలేదు. అయినా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె మాట పట్టించుకునే నాధుడే లేడు. వివాహం రోజు పెళ్లి కుమారుడు మండపానికి రాగా యువతి పారిపోయింది. 20 రోజుల తర్వాత ఊరికి తిరిగి రావడంతో పంచాయితీ పెట్టారు.
గ్రామపంచాయితీ సభ్యుల ఆద్వర్యంలో పంచాయితీ జరిగినట్లు తెలుస్తోంది. గ్రామపెద్దలు సదరు యువతిని పెళ్లిచేసుకోవాలని బలవంతం చేశారు. ఎవరినైనా ప్రేమించావా అని ఆరాతీశారు. అందుకు యువతి నోరువిప్పలేదు. దీంతో ఆమెను గుండు గీయించి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పారు. ఆపై దారుణంగా కొట్టారు. ఊరిబయట ఉన్న ఓ చెట్టుకింద వదిలేశారు. ఆమె అక్కడే గాయాలతో పడిపోయింది. తెల్లవారి పశువులను కాసుకునే పిల్లలు యువతిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాధితురాలిని చికిత్స నిమిత్తం మేదినిరాయ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. దాడికి పాల్పడిన వారిని, పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలి ప్రైవేట్ భాగాలపై గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.