విశాఖ స్టీల్ ప్లాంట్ (vizag steel plant) విషయంలో తమ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్న భారత రాష్ట్ర సమితి (BRS) వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు గురువారం మాట్లాడారు (gvl narasimha rao on brs and kcr). ఈ స్టీల్ ప్లాంట్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తామని… ఆంధ్రా ద్రోహి కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీని కేసీఆర్ ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారని, తాను పార్లమెంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడానని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. కేసీఆర్ వలె డబ్బా కొట్టుకోవడానికి తాము పని చేయడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తాము పోరాడుతుంటే కేసీఆర్, కేటీఆర్ డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచేశారని కేసీఆర్ పైన మండిపడ్డారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ఆస్తులు పెరిగాయి తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు సంస్ధను నిలబెట్టేలా ఉన్నాయన్నారు. ఇదే సమయంలో అనవసర రాజకీయం చేసి కేసీఆర్ ఆంధ్ర ప్రదేశ్ లో అడుగు పెట్టాలని కలలు కంటున్నారన్నారు. ఉద్యమం సమయం సహా వివిధ సందర్భాల్లో ఆంధ్ర ప్రదేశ్ పైన చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పిన తర్వాత ఇక్కడ అడుగు పెట్టాలన్నారు. రాజకీయ అవసరాల కోసం ఏపీకి వచ్చి ఉద్దరిస్తాననడం సిగ్గుచేటు అన్నారు. మొదట ఏపీకి రావాల్సిన నిధులను కేసీఆర్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆంధ్రా ద్రోహి అన్నారు. ఏపీలో డ్రామాకు తెరదీస్తే గట్టిగా బుద్ధి చెబుతామన్నారు.
కాగా, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రస్తుతానికి ప్రయివేటికరిస్తలేమని కేంద్రమంత్రి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటది అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం (Govt of India) స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) హర్షం వ్యక్తం చేశారు. ‘విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడిన నాయకుడు కేసీఆర్. ఎట్ల అమ్ముతారో మేం చూస్తాం. అదానీకి ఇచ్చిన బైలదిల్లా ఉక్కు ఫ్యాక్టరీ వల్ల వైజాగ్. అవసరమైతే మా సింగరేణిని పంపి. అధ్యయనం చేస్తామని ప్రకటించారు. దెబ్బ అంటే గట్లుంటది. ఎట్లుంటదంటే అట్లుంటది. కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా అట్లే ఉంటది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేసీఆర్ వ్యూహానికి దిగొచ్చి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన మోడీ సర్కార్’ అని బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియాలో (Social Media) ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు.