తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై.. కొద్దిసేపటి తర్వాత ఇంగ్లీష్‌లో ప్రసంగాన్ని కొనసాగించారు. మొదట రాజ్ భవన్ గురించి ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, స్త్రీల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేశామని మాట్లాడిన ఆమె.. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేయడం గమనార్హం.
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ జెండాను ఎగురవేసేందుకు అనుమతించకపోవడం తనను నిరుత్సాహానికి గురిచేసిందని అన్నారు.
ఒక మహిళా గవర్నర్‌పై ఎలాంటి వివక్ష చూపారో రాష్ట్రం చరిత్ర లిఖిస్తుందని తమిళిసై వ్యాఖ్యానించారు. గవర్నర్ స్థానానికి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని తమిళిసై మండిపడ్డారు. మేడారం, భద్రాచలం పర్యటనలకు వెళ్లినప్పుడు హెలీకాప్టర్ అడిగితే కనీసం స్పందించలేదని గుర్తుచేసుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా 8 గంటలు ప్రయాణించి వెళ్లినట్టు తెలిపారు. ప్రజల్ని కలవాలంటే కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తే అక్కడికి కూడా రాలేదని గుర్తు చేశారు. సమాచారం కూడా అందించలేదన్నారు. ఇలాంటివి ఇష్యూ చేయాలని లేదని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ వ్యాఖ్యానించారు.
‘ఇటీవల దక్షిణ జోనల్ సమావేశం జరిగింది. నేను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా దానికి హాజరయ్యాను. ఆ సమావేశంలో 75 శాతం సమస్యలు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. ముఖ్యమంత్రులందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు మీరు (కేసీఆర్) ఎందుకు హాజరు కాలేదు? సమస్య పరిష్కారానికి కేంద్ర హోంమంత్రి ఉన్నప్పుడు, మీకు సమస్య ఏమిటి? మీకు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.’ అని ఆమె అన్నారు.