ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి, 2015లో నాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేసిందని, చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం నిర్మాణం కోసం రూ.2500 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విభజన చట్టాన్ని అనుసరించి, 2015లో నాటి ప్రభుత్వం అమరావతిని (Amaravti) రాజధానిగా చేసిందని, చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం నిర్మాణం కోసం రూ.2500 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం (Government) సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. రాజధానిపై చట్టం చేసే అధికారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (Assembly) లేదని హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో కేంద్ర హోం శాఖ అండర్ సెక్రటరీ శ్యామల్ కుమార్ బిత్ బుధవారం 14 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
దీని ప్రకారం… రాజధాని అంశం విభజన చట్టంలోని సెక్షన్ 5, 6తో ముడివడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని 5వ నిబంధన దాని ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి పదేళ్లకు మించకుండా ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. విభజన చట్టంలోని సెక్షన్-6 ప్రకారం ఏపీ కొత్త రాజధానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసి, విభజన చట్టం రూపొందించిన ఆరు నెలల్లోపు తగిన ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందని అందులో పేర్కొన్నారు. అలాగే, కేంద్రం 28 మార్చి 2014లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏపీకి కొత్త రాజధాని ఎంపికలో తీసుకోవాల్సిన అంశాల గురించిన మార్గదర్శకాలతో అదే ఏడాది ఆగస్ట్ 30న నివేదికను సమర్పించింది. ఆ నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపింది. అనంతరం 23 ఏప్రిల్ 2015న అమరావతి పేరుతో రాజధానిని ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసింది.
సెక్షన్ 94 ప్రకారం కొత్త రాజధానిలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం ఆర్థికమద్దతు ఇచ్చిందని, అందులో భాగంగా రూ.2500 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన కోసం 2014-15లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన రూ.1000 కోట్లు కూడా ఇందులో ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో నిర్మించనున్న రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసన మండలి సహా ఇతర మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలి… దీంతో కేంద్రం నిధులు విడుదల చేసింది. అయితే 2020లో సీఆర్డీఏను (CRDA) రద్దు చేసి, మూడు రాజధానులు తెచ్చే అంశంలో తమను సంప్రదించలేదని వెల్లడించింది. మొత్తానికి ేపీ రాజధాని అమరావతి అని కేంద్రం పార్లమెంటు సాక్షిగా తేల్చినట్లుగా భావించవచ్చు.
మరోవైపు, రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలలో చాలా వాటిని కేంద్రం ఇప్పటికే అమలు చేసిందన్నారు. మిగిలినవి వివిధ దశల్లో అమల్లో ఉన్నట్టు వెల్లడించారు. విభజన చట్టంలోని అంశాల అమలు గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో ఎప్పటికి అప్పుడు సంప్రదింపులు, సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లలో 5 సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సమస్యలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని, కేంద్రం సంధానకర్త మాత్రమే అన్నారు.